ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు.. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. షియా మతాధికారుల కోట అయిన కోమ్‌కు చేరుకున్నాయి. దీంతో భద్రతా దళాలు అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం డజన్ల కొద్ది నగరాల్లో నిరసనలు వ్యాప్తి చెందాయి. టెహ్రాన్, మషద్, ఇస్ఫహాన్, లోరెస్తాన్, ఖుజెస్తాన్ వంటి నగరాల్లో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. అయతుల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. భద్రతా సిబ్బందితో నిరసనకారులు ఘర్షణకు దిగారు. ప్రస్తుతం నిరసనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రేపు అసెంబ్లీని బహిష్కరించిన బీఆర్ఎస్.. సీఎంపై హరీష్ రావు ఫైర్
రేపటి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపటి సభకు హాజరు కావొద్దని పేర్కొన్నారు. రేపు ఉదయం తెలంగాణ భవన్ లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గన్ పార్క్ దగ్గర నిరసన తెలియజేశారు. ఇక, మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య రీతిలో దిగి వస్తూ శాసనసభ నిబంధనలు లేకుండా సభను నడుపుతున్నారని ఆరోపించారు. బీఏసీలో మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు వేరు అసెంబ్లీలో పెట్టినవి వేరు.. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు పెట్టకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూసీకి సంబంధించి కొన్ని ప్రశ్నలను సభలో సందించాం.. వాటిపై సమాధానాలు ఇవ్వకుండా సీఎం మాట్లాడుతున్నారు.. అసెంబ్లీని సీఎం బూతులమయం చేశాడని ఎద్దేవా చేశారు. ఇలా మాట్లాడిన స్పీకర్ ఆయనకి అడ్డు చెప్పలేదు.. బీఆర్ఎస్ కి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఇక సభకు ఎందుకు రావాలని హరీష్ రావు ప్రశ్నించారు.
ఏ పార్టీ అయినా సరే భూ సమస్యకు కారణమైతే కేసులే.. స్పీకర్ ఆదేశాలు
మరోసారి హాట్ కామెంట్లు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. పాసు పుస్తకాల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు, ఈ పాసు పుస్తకాలు శాశ్వతమైనవని, వీటి పంపిణీ రాజకీయాలకు అతీతంగా జరగాలని సూచించారు. గ్రామీణ రైతులకు భూ హక్కులపై భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు. భూ వివాదాలు, భూ సమస్యలకు కారణమైన వారిపై పార్టీలతో సంబంధం లేకుండా కేసులు నమోదు చేయాలని ఆర్డీవో, తహసీల్దార్ అధికారులకు స్పీకర్ నేరుగా ఆదేశాలు జారీ చేశారు. “ఏ పార్టీ అయినా సరే, రైతుల భూముల విషయంలో అన్యాయానికి కారణమైతే చట్టం తన పని తాను చేస్తుంది.. కేసులు తప్పవు” అంటూ ఆయన గట్టిగా హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్న ఆయన.. రాజకీయాలకతీతంగా పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.. అయితే, భూ సమస్యలకు కారణమైన వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే.. వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు స్పీకర్ చింతకాలయ అయ్యన్నపాత్రుడు..
ఎవరో వస్తారనుకుంటే సూరి వచ్చాడు..టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో పవన్ సినిమా ఉంటుందని, భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అని గట్టిగా నమ్మారు. కానీ, 2026 నూతన సంవత్సర కానుకగా వచ్చిన అధికారిక ప్రకటనతో సీన్ మొత్తం మారిపోయింది. అభిమానుల అంచనాలకు భిన్నంగా, పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనికి ఒకటి రెండు సినిమాలు వర్కౌట్ కాకున్నా లోకేష్ కనగరాజ్ ‘LCU’ క్రేజ్ దృష్ట్యా, పవన్ కళ్యాణ్‌ను ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారో అని మెజారిటీ ఫ్యాన్స్ ఆశపడ్డారు. అయితే, సురేందర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో కొంతమంది ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సురేందర్ రెడ్డి గత చిత్రం ‘ఏజెంట్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో ఆయన ప్రస్తుతం ఫామ్‌లో లేరన్నది నెటిజన్ల వాదన. పవన్-లోకేష్ కాంబినేషన్ సెట్ అయితే అది పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసేదని, సురేందర్ రెడ్డితో ఆ రేంజ్ హైప్ రావడం కష్టమని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. 96 గదుల నిర్మాణానికి శంకుస్థాపన
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు రేపు ( జనవరి 3న) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. కొండగట్టులో 96 గదుల సత్రాల నిర్మాణ స్థలానికి పవన్ శంఖుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ స్థలాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో భద్రతా, సౌకర్యాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక, జేఎన్‌టీయూ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడు స్థలాన్ని అధికారులు పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు 1100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు. అలాగే, బృందావన్ రిసార్ట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
‘‘చెడ్డ పొరుగువారు’’.. పాకిస్తాన్‌పై దాడి చేసే హక్కు భారత్‌కు ఉంది..
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్‌ను ‘‘చెడు పొరుగుదేశం’’గా అభివర్ణించారు. ఉగ్రవాదం నుంచి తమ ప్రజల్ని రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి పాల్పడితే దాడులు చేస్తామని హెచ్చరించారు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో మాట్లాడుతూ, “మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఎవరూ చెప్పలేరు” అని మంత్రి ఆపరేషన్ సిందూర్‌ను ఉద్దేశించి అన్నారు. గతేడాది భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా తన ప్రజలను ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కును వినయోగించుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై భీకర దాడులు చేసింది. పీఓకే, పాక్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలు, వాటి కార్యాలయాలపై దాడులు చేసి, వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం, భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది.
నిపుణుల కమిటీకి SLBC హెలిమాగ్నెట్ రిపోర్ట్
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్ నిర్మాణ పనులలో కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎదురవుతున్న భూగర్భ అడ్డంకులను గుర్తించేందుకు ఎన్జీఆర్ఐ (NGRI) శాస్త్రవేత్తలు నిర్వహించిన హెలి మాగ్నెట్ సర్వే నివేదిక తాజాగా నిపుణుల కమిటీకి చేరింది. ప్రత్యేక హెలికాప్టర్ సహాయంతో సుమారు 13 లైన్లలో సర్వే చేపట్టిన శాస్త్రవేత్తలు, భూమి లోపల దాదాపు 800 మీటర్ల లోతు వరకు ఉన్న భూ స్వరూపంపై సమగ్ర సమాచారాన్ని ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ సర్వేలో భాగంగా నల్లవాగు సమీప ప్రాంతంలో ‘షీర్ జోన్’ ఉన్నట్లు గుర్తించగా, మిగిలిన చోట్ల టన్నెల్ నిర్మాణానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు సమాచారం అందింది.
మచిలీపట్నం పోర్టుపై మంత్రి కీలక అప్డెట్.. ఎప్పటిలోగా పూర్తవుతుందంటే..?
మచిలీపట్నం పోర్టుపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక అప్డెట్ ఇచ్చారు. మచిలీపట్నం పోర్టు ఒక సంవత్సరంలో పూర్తి అవుతుందని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. దాదాపు 400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నామన్నారు. పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు ఎక్కడ ప్లే ఓవర్, అండర్ పాస్ లు ఉండాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారని చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.. ఇందుకోసం 2 వేల కోట్లు ఖర్చు అవుతాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదన చేశామని.. విజయవాడ నుంచి గోసాల వరకు రోడ్డు విస్తరణ చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. పెడన, గుడివాడ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో హైవేకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చెప్పారని తెలిపారు.
వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్..
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. బెజవాడ మాచవరం పోలీసులు వంశీపై హత్య యత్నం కేసు నమోదు చేశారు. నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీ పై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వంశీని అరెస్టు చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ చేపడుతుందని వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారంటూ నూతక్కి సునీల్ అనే వ్యక్తి విజయవాడ మాచవరం పోలీసులకు ఈనెల 17న ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు కేసు ఫైల్ చేశారు. వంశీతో పాటు ఎనిమిది మందిపై హత్యాయత్నం సహా పలు కేసులు నమోదయ్యాయి. కేసు నమోదైన సంగతి తెలిసిన దగ్గర్నుంచి వంశీ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. వంశీ తో పాటు కేసులో నిందితులుగా ఉన్న మిగతా వారు కూడా కనిపించడం లేదు. దీంతో.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని టీమ్‌లు హైదరాబాద్‌లో గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి వంశీకి ఊరట లభించింది.
భారత వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. ఇవే ఆధారం అంటున్న బీజేపీ..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, భారత వ్యతిరేకులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. 2024లో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను ప్రస్తావిస్తూ.. యూఎస్ చట్టసభ సభ్యురాలు జానిస్ షాకోవ్స్కీతో ఆయన ఉన్న ఫోటోను ప్రస్తావించింది. ఈ వారం షాకోవ్క్సీ 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్‌కు అనుకూలంగా ఒక లేఖపై సంతకం చేశారు. ఉమర్ ఖలీద్‌ను విడుదల చేయాలని కోరుతూ, మరో ఏడుగురితో కలిసి ఆమె సంతకం చేశారు. ఈ సంబంధాలను హైలెట్ చేస్తూ బీజేపీ నేత ప్రదీప్ భండారీ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ యాంటీ-ఇండియా నేతలతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో రాహుల్ గాంధీ షాకోవ్స్కీ, ఇల్హాన్ ఒమర్‌తో కలిసి ఉన్నారు. ఇల్హాన్ ఒమర్ తీవ్ర భారత వ్యతిరేకి, పాకిస్తాన్ మద్దతురాలు. పలు సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్ గురించి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ.. భారతదేశాన్ని బలహీనపరచాలని చూసేవారు, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకునే వారు, ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను నీరుగార్చాలనుకునే వారు అతడి(రాహుల్ గాంధీ) చుట్టూ చేరుతారు’’ అని అన్నారు. అయితే, బీజేపీ విమర్శలపై రాహుల్, కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు.