మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు నారాయణరావు గురించి సంచలన నిజాలు..!
తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు గురించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. తుని కొండ వారి పేటకు చెందిన నారాయణరావు ఇంటి ముందు మైనర్ బాలిక ఇల్లు ఉంది. మైనర్ బాలికకు తండ్రి లేడు. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. గతంలో సైతం మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాల నుంచి తీసుకుని వెళ్లాడు. పాపకు బ్లెడ్ ఇన్ఫెక్షన్ ఉందని ఇంజక్షన్ చేయించాలని ఇప్పటివరకు మూడుసార్లు స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. తాను పాపకు తాత అవుతానని స్కూల్ లో చెప్పాడు. మంగళవారం కూడా ఇదే విధంగా పాపను తీసుకెళ్లాడు. తొండంగి సమీపంలో పొలాల దగ్గరికి తీసుకునివెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
పోచారం కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీం, మరో ఇద్దరు అరెస్ట్
పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీం సహా మరో ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఈ ముగ్గురు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. అనంతరం టాస్క్ ఫోర్స్ అధికారులు వారిని రాచకొండ పోలీసులకు హ్యాండ్ఓవర్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ కాల్పుల కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితులను పోలీసులు నేడు మీడియా ముందుకు తీసుకురానున్నారు.
మార్కెట్లో కొత్త జోష్.. భారీ లాభాల్లో దూసుకెళ్తున్న సూచీలు
దీపావళి తర్వాత స్టాక్ మార్కెట్లో కొత్త జోష్ కనిపిస్తోంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం కళకళలాడుతోంది. గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్, నిఫ్టీ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 702 పాయింట్ల లాభపడి 85,128 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 208 పాయింట్లు లాభపడి 26,077 దగ్గర కొనసాగుతోంది.
ఈసీ సంచలన నిర్ణయం.. దేశ వ్యాప్తంగా ‘‘SIR’’ చేపట్టేందుకు కసరత్తు
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది. దీనిపై విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినా.. తర్వాత సైలెంట్ అయిపోయాయి. బంగ్లాదేశ్, మయన్మార్ సహా ఆయా దేశాల నుంచి వచ్చిన వారంతా ఆయా రాష్ట్రాల్లో తిష్ట వేసిన నేపథ్యంలో ఈసీ సర్వే చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టాకే బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీత పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో, బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కొత్తగా పార్టీలో చేరికలు, ప్రచార వ్యూహం తదితర అంశాలను ఇద్దరూ కేసీఆర్‌కు వివరించారు.
మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన సీమంతం వేడుకలో మెగా హంగామా!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ హ్యాపీ న్యూస్‌తో మెగా ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయింది. దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసనకు సీమంతం వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. ఉపాసన తన సోషల్ మీడియాలో ఈ వేడుక వీడియో ని షేర్ చేస్తూ “డబుల్ సెలబ్రేషన్స్” అంటూ క్యాప్షన్ పెట్టింది. వీడియో లో చరణ్-ఉపాసన జంటతో పాటు చిరంజీవి, సురేఖ, నిహారిక, అల్లు కుటుంబ సభ్యులు అందరూ కనిపించారు. ఇప్పటికే ఈ దంపతులకు 2023 జూన్‌లో పాప క్లీంకార పుట్టగా, రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ వారి ఇంటికి మరో సంతోషం రాబోతోంది. ఈ హ్యాపీ న్యూస్ తెలిసిన వెంటనే మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. “సింబా వస్తున్నాడు” అంటూ కామెంట్ పెడుతూ మెగా ఫ్యాన్స్ జోష్ చూపిస్తున్నారు. మెగా ఫ్యామిలీకి ఇది నిజంగా డబుల్ సెలబ్రేషన్ టైమ్ అని చెప్పవచ్చు !
ఇదంతా పెద్ద మాఫియా.. రాష్ట్రంలో నకిలీ మద్యంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్..
రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవస్థీకృత పద్ధతిలో అమ్ముతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఇలాంటి మాఫియా ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరన్నారు.. ఏకంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ఆరోపించారు.. వాళ్ళ మనుషులకు ఏ రకంగా షాపులు వచ్చాయి.. వాళ్ళు ఎలా నడుపుతున్నారు అందరూ చూస్తున్నారన్నారు.. గ్రామాల్లో ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు నడుపుతున్నారని.. బెల్ట్ షాపులతో పాటు ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా విచ్చలవిడిగా కల్తీ మధ్య విక్రయిస్తున్నారని ఆరోపించారు.. వీళ్ల జేబులు నింపుకోవడానికి దిగజారి వ్యాపారం చేస్తున్నారన్నారు.. పెద్దఎత్తున మద్యం, స్పిరిట్ డంపులు దొరికాయి. దొరికిన వాటితో లక్షల లీటర్ల మద్యం దొరికేదని అభిప్రాయపడ్డారు.. సీపీ పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు..
సీఎం, మంత్రుల పంపకాల పరంపర.. రాష్ట్ర పరువుకు మచ్చ
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలు తెలుగు ప్రజలకు తలవంచుకునే పరిస్థితి తెచ్చాయని ఆయన విమర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాలు రాష్ట్ర పరువుకు మచ్చలాంటివి. ఐఏఎస్ అధికారులను బలి పశువులుగా మార్చే పరిస్థితి వచ్చింది,” అని అన్నారు. నిజాయితీ పరుడిగా పేరున్న రిజ్వి వలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ట్రంప్‌ను కలవలేకే సదస్సుకు మోడీ దూరం.. కాంగ్రెస్ విమర్శ
మలేషియాలో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లకపోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ సదస్సుకు ట్రంప్ రావడంతోనే మోడీ వెళ్లడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఈ సమావేశానికి వెళ్లడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘చాలా రోజులుగా ఈ సదస్సు గురించి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మోడీ దీనికోసం కౌలాలంపూర్ వెళ్తారా? లేదా? అని. ఇప్పుడు వెళ్లడం లేదని తేలిపోయింది. అంటే ప్రపంచ నాయకులను ఆలింగనం చేసుకొని ఫొటో తీసుకోవడంతో పాటు తనని తాను విశ్వగురువుగా చాటుకొనే అవకాశం కోల్పోయారు. మోడీ ఈ సదస్సుకు వెళ్లకపోవడానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అక్కడ ఉండటమే. కొన్ని వారాల క్రితం ఈజిప్టులో జరిగిన గాజా శాంతి సమావేశానికి కూడా మన ప్రధాని హాజరుకాలేదు. ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించిన కారణంగా.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. కానీ.. ట్రంప్ ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపానని 53 సార్లు.. రష్యా చమురును భారత్ కొనుగోలు నిలిపివేసిందని ఐదుసార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో కలవకుండా మోడీ జాగ్రత్త పడుతున్నారు’ అని జైరాం రమేష్ విమర్శించారు.
135 సెట్ల నామినేషన్లకు ఆమోదం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థుల కోసం 321 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో 135 సెట్ల నామినేషన్లు (81 మంది అభ్యర్థులవి) అధికారులు ఆమోదించారు. మిగిలిన 186 సెట్ల నామినేషన్లు (130 మంది అభ్యర్థులవి) వివిధ లోపాల కారణంగా తిరస్కరించబడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన అఫిడవిట్లో కొన్ని అవసరమైన వివరాలను పేర్కొనలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, రిటర్నింగ్ అధికారి ఆమెను డిక్లరేషన్ సమర్పించాలని సూచించారు. అలాగే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సమర్పించిన పత్రాల్లోనూ లోపాలు గుర్తించబడ్డాయి. అధికారుల వివరణ కోరిన తర్వాత మాగంటి సునీత, నవీన్ యాదవ్ నామినేషన్లు ఆమోదించబడ్డాయి.