ఆంధ్రప్రదేశ్ లో పండిన మామిడి పండ్లను ఉత్తర భారతదేశానికి తీసుకెళ్లేందుకు వీలుగా వాల్తేర్ రైల్వే డివిజన్ ‘ మ్యాంగో ఎక్స్ ప్రెస్’ని ప్రారంభించింది. అయితే ఈ సీజన్ లో మాత్రం మ్యాంగో ఎక్స్ ప్రెస్ లేనట్టే. స్థానిక మార్కెట్ లో మంచి ధర పలుకుతుండటంతో వ్యాపారులు కూడా తమకు ఇబ్బందులు లేవని చెబుతున్నారు. అయితే బొగ్గు తరలింపుకు ప్రాముఖ్యత ఇచ్చిన రైల్వే శాఖ విజయనగరం నుంచి న్యూ ఢిల్లీ వెళ్లే మ్యాంగో ఎక్స్ ప్రెస్ రైలు సర్వీస్ ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. చిత్తూర్, కృష్ణా జిల్లాల తరువాత ఏపీలో విజయనగరంలోనే మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఉమ్మడి విజయనగరంలో 35,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి.
ఈ ఏడాది 18 వేల హెక్టార్లలోనే మామిడి సాగయింది. హెక్టార్ కు కేవలం మూడు టన్నుల దిగుబడి వచ్చింది.. గతంలో ఇది ఐదు టన్నుల వరకు ఉండేదని హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ సారి మామిడి పండ్ల సరఫరాకు రైలు సౌకర్యం లేకపోవడంతో ట్రక్కుల ద్వారానే మార్కెట్లకు తరలించారు. పండించిన మొత్తం పంటలో సగం మాత్రమే వేరే ప్రాంతాలకు వెళ్లాయని.. మిగిలినవి ఏపీ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోని మార్కెట్లకు తరలించామని తెలిపారు.
Read Also:BJP National Executive Meeting: కావాలనే రెచ్చగొడుతున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్
ఇదిలా ఉంటే ఉత్తర భారత మార్కెట్ లో వ్యాపారులు టన్నుకు రూ.50,000-80,000 మధ్య చెల్లిస్తున్నారు. అయితే గతేడాది ఇది రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు పలికేదని సాగుదారులు చెబుతున్నారు. మ్యాంగో ఎక్స్ ప్రెస్ 2019లో 10,179 టన్నులను 2020లో 7000 టన్నులను 2021లో 4330 టన్నుల మామిడిని ఢిల్లీకి తీసుకెల్లింది. గతేడాది మే 30న మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కూడా మ్యాంగో ఎక్స్ ప్రెస్ ప్రారంభించినందుకు వాల్తేర్ డివిజన్ ను మెచ్చుకున్నారు.