టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు అశోక్‌బాబు ఇంటికి సీఐడీ సీఐ పెద్దిరాజు నోటీసు అంటించారు. అశోక్‌బాబుపై గతంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో 477(ఎ), 466, 467, 468, 471, 465, 420, ఆర్‌డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ పోలీసులు పేర్కొన్నారు.
Read Also: ఉగాది నుంచే ఏపీలో కొత్త జిల్లాలు
కాగా అశోక్ బాబు డిగ్రీ విషయంలో విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకాయుక్త వాణిజ్య పన్నుల విభాగం నుంచి నివేదిక తెచ్చుకుంది. దీనిపై విచారణ జరిపించాలని కోరింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ డి.గీతామాధురి ఇటీవల అశోక్ బాబుపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐడీ పోలీసులు గురువారం రాత్రి అశోక్‌బాబు ఇంటి వద్ద మఫ్టీలో కాపుకాశారు. ఓ వివాహానికి హాజరైన అశోక్‌బాబు రాత్రి 11:30 గంటల సమయంలో ఇంటికి రాగా.. అప్పటికే అక్కడ కాపుకాసిన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.