డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన కామెంట్స్ ఆ పార్టీకే ఇబ్బందులు తెచ్చిపెట్టాయా? రాజకీయ లబ్ధికోసం గుడ్డిగా ఏదేదో మాట్లాడి ఓ సామాజికవర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితి దాపురించిందా..? కాకినాడ ఎపిసోడ్ తర్వాత టీడీపీలో వినిపిస్తున్న గుసగుసలేంటి.. రుసరుసలేంటి..?
కాకినాడలో పట్టాభి కామెంట్స్ కలకలం..!
ముంద్రా పోర్టులో హెరాయిన్ పట్టుబడిన అంశాన్ని అధికార వైసీపీకి చుట్టేస్తూ.. టీడీపీ పెద్దఎత్తున ప్రెస్‌మీట్ల పోరాటం చేస్తోంది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయేంత వరకు టీడీపీలో చంద్రబాబు మొదలుకొని ఎవరో ఒకరు ఏదో ఒక మూల నుంచి డ్రగ్స్ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. అధికార పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి రెండాకులు ఎక్కువే నమిలి.. ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో కాకినాడకు వెళ్లి.. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి డ్రగ్స్‌తో సంబంధం ఉందని ఆరోపిస్తూ పట్టాభి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. రాజకీయ విమర్శలు పక్కకుపోయి మత్స్యకారులు కాకినాడ టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసే పరిస్థితి ఎదురైంది.
కాకినాడకు పట్టాభి వెళ్లాల్సి అవసరం ఏమొచ్చిందని పార్టీలో ప్రశ్నలు..!
చినరాజప్ప క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని పార్టీలో ఆవేదన..!
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి చాలామంది సీనియర్లు ఉన్నారు. మాజీ హోంమంత్రి చినరాజప్ప.. జ్యోతుల నెహ్రు.. ఎమ్మెల్యేలుగా.. ఎంపీలుగా పోటీ చేసిన వాళ్లు ఎంతో మంది ఉండగా.. పట్టాభి కాకినాడకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారట. ఏదో చేద్దామని కాకినాడకు కారెక్కిన పట్టాభి.. మొత్తంగా టీడీపీని.. ఆ జిల్లా టీడీపీ నేతలు తీవ్ర అవమానం పాలయ్యే పరిస్థితులు కల్పించారని అభిప్రాయపడుతున్నారట. జూమ్ ప్రెస్‌మీట్స్‌లో మాట్లాడినట్టు ఫీల్డుకి వెళ్లి మాట్లాడితే సమస్యలు వస్తాయనే విషయాన్ని గుర్తించకుండా.. పట్టాభిని కాకినాడకు పంపడం సరైన నిర్ణయం కాదని చర్చ జరుగుతోంది. చివరకు పట్టాభి రగిల్చిన నిప్పుతో ఏర్పడ్డ గ్యాప్, జరిగిన డ్యామేజ్ పూడ్చడానికి నిమ్మకాయల చినరాజప్ప క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఏ ద్వారంపూడి మీదైతే పోరాటానికి వెళ్లారో.. అదే ద్వారంపూడితోనే రాజీపడే పరిస్థితిని తెచ్చారని పట్టాభిపై పార్టీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మత్స్యకారులను దగ్గర చేసుకోవాల్సింది పోయి.. విమర్శలా అని ప్రశ్న..!
డ్రగ్స్ స్మగ్లింగ్ రగడ కాస్తా మత్స్యకారుల సామాజికవర్గాన్ని టీడీపీ విమర్శిస్తుందనే రీతిలో సమస్య టర్న్ తీసుకోవడంపై పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోందట. పార్టీ ఆవిర్భావం నుంచి మత్స్యకారులు టీడీపీతోనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ సామాజికవర్గం ఓట్లు వైసీపీకి మళ్లాయి. పార్టీకి దూరమైన సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోవాల్సింది పోయి ఇలా చేస్తే నష్టం కదా అంటున్నారట. కీలక సందర్భాల్లో సీనియర్లను పక్కన పెట్టేసి.. పట్టాభిలాంటి వారితో మాట్లాడిస్తే పెద్దగా ఉపయోగం ఉండదని అభిప్రాయ పడుతున్నారట. ఆర్థిక విధానాలపై పయ్యావుల కేశవ్.. నెల్లూరు జిల్లాలో అవినీతిపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర తదితరులు చేసిన పోరాటాలు, రాజధాని భూముల విచారణలో ధూళిపాళ్ల ప్రకటనలు.. అనపర్తిలో నల్లమిల్లి శేషారెడ్డి చేసిన వినూత్న నిరసనలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని టీడీపీలో అనుకుంటున్నారట.
గోరంట్ల చేసిన సెల్ఫీ నేతల కామెంట్స్ గుర్తు చేసుకుంటున్నారట..!
సెల్ఫీ నేతలకు హైకమాండ్ ఇంపార్టెన్స్ ఇచ్చినంత కాలం పార్టీకి కష్టకాలమేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్స్‌ను తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారట. అయితే పార్టీ గురించి మాట్లాడడానికి సీనియర్లు ఎవ్వరూ స్పందించక.. పట్టాభి వంటి వారు ముందుకు రావడంతో పార్టీ అధినాయకత్వం విధిలేని పరిస్థితుల్లో వాళ్లని ఎంకరైజ్ చేయక తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.