ఏపీలో ఓ వీడియో కాల్ వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య మాటల దుమారానికి కారణం అవుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సీఐడీ అధికారి సునీల్ కుమార్ తీరుపై మండిపడ్డారు. ఒక డర్టీ ఎంపీని కాపాడేందుకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో మహిళలకు భద్రతెలా ఉంటుంది..? రాష్ట్ర పరువు మంట గలిపిన ఎంపీ గోరంట్ల మాధవ్ ని వెనకేసుకొస్తున్న పోలీసులు, ప్రభుత్వం రోజుకో డ్రామా ఆడుతోంది. పార్లమెంట్ వ్యవస్థకు సంబంధించిన ఈ అంశంపై నిజా నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.
అసలు వీడియో సంపాదించాల్సిన బాధ్యత పోలీసులుదా లేక ప్రతిపక్షానిదా..? తాడేపల్లి ఆదేశాలు అనుసరించి డర్టీ ఎంపీని కాపాడేందుకే ఐపీఎస్సులయ్యారా? సునీల్ కుమార్ చట్టానికి అతీతుడు కాదు, మాపై కేసులు పెడతామని బెదిరిస్తున్న సునీల్ కుమార్ పై మేం కేసులు పెట్టలేమా..? ఓ వైపు ప్రైవేటు ల్యాబ్ నివేదికను పరిగణనలోకి తీసుకోమని చెప్తూనే, కేసు పెడతానని ఎలా అంటారు..? సునీల్ కుమార్ చదివింది ఐపిఎస్సా లేక వైపీఎస్సా? అని ఎద్దేవా చేశారు బోండా ఉమా. సీఐడీ చీఫ్ ఏ అధికారంతో ఎంపీని వెనకేసుకొచ్చారు.
కేసు బాధ్యతలను ప్రభుత్వం సీఐడీకి ఎప్పుడు ఆప్పగించింది..? పోలీసు అధికారులు చేయాల్సిన పని జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపటం.. ఆ పని చేయకుండా సొల్లు కబుర్లేoదుకు..? గోరంట్ల మాధవ్ ది ఫేక్ వీడియో అయితే ఈపాటికి అది సృష్టించిన వారిని బూటకపు ఎన్ కౌంటర్ చేసేవాళ్ళు కాదా అన్నారు బోండా ఉమా.