టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అంటేనే టెక్నాలజీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఒరవడి, ప్రాజెక్టులు, సాఫ్ట్‌వేర్ ఇలా అన్నింటి వెనుక చంద్రబాబు కృషి ఉందని ప్రస్తుత మంత్రులే కొనియాడిన సందర్భాలు ఉన్నాయి.. ఈ సీనియర్ పొలిటిషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆ తర్వాత ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా సేవలు అందించినా.. ఎంతో సింపుల్‌గా కనిపిస్తారు.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా ఎప్పుడూ ఒకే రకమైన వస్త్రధారణతో కనిపిస్తుంటారు.. టెక్నాలజీని పరిచయం చేసిన చంద్రబాబుకు.. హైటెక్ బాబు అంటూ బిరుదులు కూడా ఉన్నాయి.. ప్రతిపక్షాలు ఆ పేరుతో ఆయనను విమర్శించిన సందర్భాలు లేకపోలేదు.. అయితే, ఉన్నట్టుండి టీడీపీ అధినేత చేతి వేలికి ఓ ఉంగరం వచ్చి చేరింది.. ఎప్పుడూ ఉంగరాలు ధరించని ఆయన సడన్‌గా ఇలా మారిపోయారేంటి? అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో మొదలయ్యాయి.. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఆయన మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడుకు ఉంగరం ధరించి వచ్చారు.. అంతే కాదు.. తన ఎడమ చేతి చూపుడు వేలికి పెట్టుకున్న ఉంగరం వెనుక ఉన్న కథ ఏంటో కూడా తెలుగు తమ్ముళ్లకు తెలియజేశారు.
Read Also: Virat Kohli: ఇదే చివరి అవకాశం.. తేల్చి చెప్పిన అధికారి
ఎడమ చేతి చూపుడు వేలుకు రింగ్ ధరించారు చంద్రబాబు.. ఆధునిక సాంకేతికతతో కూడిన రింగ్ కావడం మరో విశేషం.. ఆ రింగ్‌లో మైక్రో చిప్ అమర్చబడి ఉంటుందని తెలిపారు చంద్రబాబు.. అది హెల్త్ మానిటర్ పరికరమని.. మైక్రో చిప్ సాయంతో పని చేస్తుందన్నారు. ఈ చిప్ తన ఆరోగ్య సమాచారాన్ని నిత్యం కంప్యూటర్‌కు పంపుతుందని వెల్లడించారు.. రోజులో ఎన్ని అడుగులు నడిచారు.. ఆక్సిజన్ లెవల్స్, బీపీ, హార్ట్ బీట్, నిద్ర సమయం తదితర ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు చిప్ నమోదు చేస్తుందని వెల్లడించారు.. ఏ సమయంలో నిద్రకు ఉపక్రమిస్తున్నారు.. ఎన్ని గంటలకు లేస్తున్నారనే విషయాలను ఈ చిప్ మానిటర్ చేస్తుంది. దీన్ని బట్టి వైద్యులు ఆరోగ్యం విషయమై తనకు సలహా ఇస్తారని.. తాను ధరించిన రింగ్ గురించి పార్టీ క్యాడర్‌కు వివరించారు చంద్రబాబు.. అంతేకాదు, ప్రతీ కార్యకర్త ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలని సూచనలు చేశారు.. కాగా, 70 ఏళ్లు దాటినా చాలా చురుకుగా కనిపిస్తారు చంద్రబాబు.. దాంతో ఆయన ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ ఏంటో తెలుసుకోవచ్చు.. ఇక, ఆహారం విషయంలోనూ ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. ఇక, జులై 1వ తేదీ నుంచి చంద్రబాబు ఎడమ చేతికి ఈ ఉంగరాన్ని ధరిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం.. సాదాసీదా జీవితం.. జేబులో పెన్నుతో మాత్రమే కనిపించే చంద్రబాబు.. వాచీ కూడా పెట్టుకోరు. అయితే, ఇప్పుడు ఎడమచేతి చూపుడు వేలికి ఉంగరం ధరించడం హాట్ టాపిక్‌గా మారితే.. దానిలో ఉన్న సీక్రెట్ చెప్పి మరి అందరినీ ఆశ్చర్య పరిచారు చంద్రబాబు.