ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులతో భేటీ అయిన ఆయన… వైసీపీ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పని చేయని నేతలను ఉపేక్షించేది లేదన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలూ నష్టపోయాయని గుర్తుచేశారు. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలు న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకూ నాయకులు అండగా నిలవాలని సూచించారు. తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని సీఎం.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు?అని ఎద్దేవా చేశారు. తల్లీ చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేశారని తెలిపారు. మరో చెల్లి తన తండ్రి హత్య కేసు పరిష్కారానికి పోరాటం చేస్తోందని చెప్పారు. ఇక… టీటీడీ బోర్డు నిర్ణయాలతో భక్తుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు చంద్రబాబు.
Read Also: Sonia Gandhi: మోడీ, యోగీ ప్రభుత్వాలతో అన్ని వర్గాలకు అన్యాయం
ఇక, జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్!అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు. సీఎం జగన్ అసమర్ధ, స్వార్ధపూరిత విధానాలతో రాష్ట్రం నష్టపోయిందన్నారు చంద్రబాబు. వైసీపీ రౌడీయిజం, సెటిల్‌మెంట్లపై గట్టిగా పోరాడాలని నాయకులకు సూచించారు. జగన్ దగ్గర డబ్బు, అధికారం ఉంటే.. టీడీపీకి ప్రజా బలం ఉందని స్పష్టంచేశారు. పని చెయ్యని నాయకుల్ని పార్టీ భరించాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలోనే ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నామని ప్రకటించారు చంద్రబాబు. టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ 100వ జయంతి, మహానాడుకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టంచేశారు చంద్రబాబు.