ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి టీడీపీ మీద మండిపడ్డారు. టీడీపీ సహా ఇతర పార్టీలన్నీ ఫిలాసఫీ లేని పార్టీలని.. పాలసీ, విధానం లేకుండా పొత్తులు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టుకున్నట్టేనని ఆయన అన్నారు. సీఎం జగన్ మాత్రం పొలిటికల్ ఫిలాసఫీతో ఉన్నారని, అందుకే సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. పిల్లల విద్య కోసం నాడు-నేడు, విద్యా దీవెన, అమ్మ ఒడి వంటివి అనేక కార్యక్రమాల్ని రూపొందించారని తెలిపారు.
గతంలో జన్మ భూమి కమిటీలు ఇచ్చిందే ఫైనల్ లిస్ట్ అని.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, పూర్తి పారదర్శకంగా అర్హులను గుర్తించి పథకాలు ఇవ్వడం జరుగుతుందోని సీతారాం చెప్పారు. గ్రామంలో పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో పాలనని సీఎం జగన్ డీసెంట్రలైజ్ చేశారన్నారు. ఎందరు కలిసినా సరే, సీఎం జగన్‌ని ఎదుర్కోలేరని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారని.. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాజకీయ మధ్యవర్తి లేకుండానే తమ పథకాలన్నీ లబ్ధిదారులకు చేరుతున్నాయని, తమ సీఎం పాలనలో మిడిల్ మ్యాన్ వ్యవస్థకు తావు లేదని వెల్లడించారు.
ఇదే సమయంలో మాజీ మంత్రి నారాయణ కేసు గురించి మాట్లాడుతూ.. ఆయన కేసుపై చేస్తున్న హడావుడి చూస్తుంటే, ప్రశ్నాపత్రాల లీకేజీని చంద్రబాబు సమర్థిస్తున్నారా? సీతారాం ప్రశ్నిస్తున్నారు. చట్టం తన పని తను చేస్తోందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని, ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళకు తగిన శాస్తి జరుగుతుందన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడానికి సర్కస్ ఫీట్స్ చేస్తున్నాయి స్పీకర్ సీతారాం ఎద్దేవా చేశారు.