ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ విస్తరణపై స్పందించారు. కొత్త మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది సీఎం జగన్‌కు ఉన్న విశేష అధికారం అని.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ నేతలు శిరసావహిస్తారని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోందని.. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
2024లో జరిగే ఎన్నికలు ప్రొ.జగన్, ప్రొ.ప్రభుత్వంగా జరుగుతాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. గత ఎన్నికలలో టీడీపీపై వ్యతిరేకత, జగన్ పాదయాత్ర వైసీపీని గెలిపించాయని.. ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల విశ్వాసం తమ పార్టీని విజయం వైపుకు నడిపిస్తాయన్నారు. జగన్ సంతృప్తికర పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఉనికి కోసమే ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఆరాటపడుతుందని ఎద్దేవా చేశారు. ముందు వాళ్ళ పార్టీలో సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు.