చింత గింజలు.. చింతపండునుంచి తీసేసి బయట పారేస్తుంటాం. కానీ ఆ చింతగింజలే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్నికుటుంబాలకు మంచి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు చింతగింజలతో వ్యాపారం చేసేస్తున్నాయి. కాకినాడ జిల్లాలో చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తూ.. ఇతర దేశాలకు చింత గింజల పౌడర్ ఎగుమతి చేస్తున్నాయి.
మనలో చాలామంది చింత పిక్కలాట.. వామన గుంటలు.. వైకుంఠపాళీ.. అష్టా–చెమ్మా వంటి ఆటలు ఆడినవారే. చింతగింజలు కనిపిస్తే ఆడవారు ఆటలు ఆడేస్తారు. అయితే చింతగింజలు ఇప్పుడు లక్షలు తెచ్చిపెడుతున్నాయి. వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా మారిన చింత పిక్కలు ఇప్పుడు అమెజాన్ లాంటి ఈ–కామర్స్ ఆన్‌లైన్ సైట్లలోనూ అమ్ముడుపోతున్నాయి. ఏటా వేలాది టన్నుల చింత గింజలు మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ మనకు విదేశీమారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. కాకినాడ జిల్లాలోని పలు మండలాల్లో చింతగింజలు సేకరించే వ్యాపారులు పెరిగారు.చింతపండు వ్యాపారుల నుంచి చింత గింజలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. అక్కడ వాటిని శుభ్రం చేసి.. గింజలకు పైన ఉండే తోలు తొలగించి గుజరాత్, మహారాష్ట్ర, సూరత్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.
చింత గింజలు కేజీ 10 రూపాయలకు కొంటారు. ఆ తర్వాత తోలు తీసిన చింత గింజల కేజీకి 20 రూపాయల ధర పలుకుతుంది. ఈ చింతగింజలు టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్మేస్తున్నారు. కాకినాడ జిల్లాలో రోజుకు 60 టన్నుల వరకు చింత గింజలు లభ్యమవుతుండగా 20 టన్నుల వరకు ప్రాసెసింగ్ జరుగుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, హిందూపురం తదితర ప్రాంతాల్లో చింత గింజలు దొరుకుతాయి. కాకినాడ, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో చింత గింజల్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఏర్పాటుచేశారు. చింతగింజల ఎగుమతి ద్వారా వస్తున్న ఆదాయం రూ.36 కోట్ల పైమాటే. వీటి కొనుగోళ్లు, ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.65 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
తోలు తీసిన తరువాత కేజీ రూ.20కి పైగా అమ్ముతారు. ప్రత్యక్షంగా చింతపండు గింజలు తీసే కుటుంబాలు రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉండగా.. వ్యాపారాలు, ఫ్యాక్టరీలలో పని చేసే కార్మిక కుటుంబాలు వెయ్యి వరకు ఉన్నాయి. చింతపండు వ్యాపారులే గింజలను సేకరిస్తారు. ఐదు కేజీల చింతపండులోంచి కేజీ చింత గింజలు వస్తాయి.
చింతగింజలు ఏంచేస్తారని చాలామందికి అనుమానం. చింతగింజలు ఆరోగ్యానికే కాదు వ్యాపారానికి కూడా ఉపయోగపడతాయి. చింత గింజల్లో ఫైబర్, ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఉండటంతో ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయని చెబుతుండటంతో పలువురు వంటకాల్లోనూ వాడతారు. చింతగింజల్నించి పౌడర్ తయారుచేసి రంగుల కంపెనీలకు విక్రయిస్తారు. ఈ పౌడర్ వల్ల రంగులు చిక్కగా మారతాయి. ఎక్కువకాలం నిల్వ వుంటాయి. ఈ చింతగింజల పౌడర్ జర్మనీ, జపాన్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ, రష్యా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చింత గింజల పౌడర్ ధర కేజీ రూ.400 వరకు ఉంటుందంటే ఎంత లాభదాయకమో అర్థం చేసుకోవచ్చు.
చింత గింజల పౌడర్ ని ప్లైవుడ్ షీట్స్, పేపర్ తయారీతోపాటు జూట్ పరిశ్రమలోనూ వాడతారు. పాలిస్టర్ గమ్, ప్లాస్టిక్ తయారీలోనూ దీనిని వాడతారు. చింతగింజల్ని ఆన్ లైన్ లో పెడితే ఇతర రాష్ట్రాల వ్యాపారులు వాటిని కొంటుంటారు. చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు మన రాష్ట్రంలో చాలా తక్కువ. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చింతపిక్కల ఫ్యాక్టరీ ఒకటే వుంది.పరిశ్రమల శాఖ అధికారులు చింతగింజల పరిశ్రమ ఏర్పాటుకు సాయం అందిస్తున్నారు. ఈ చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా ఏర్పాటయితే మరింత మందికి ఉపాధి లభిస్తుంది. అర్థమయిందా వేస్ట్ అని పడేసే చింతగింజలు కాసులు కురిపిస్తున్నాయి.
Parliament Sessions: కొవిడ్ నిబంధనల మధ్య వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు