ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం… ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. అయితే, 11వ తరగతి పరీక్షలను సెప్టెంబర్‌లో జరుపుతామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది కేరళ సర్కార్.. కానీ, ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. కాగా, పరీక్షల రద్దు విషయంలో ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.