చిన్న అవసరం, పర్మిషన్ కావాలన్నా.. ఆ అధికారులు లంచం కోసం డిమాండ్ చేస్తుంటారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం లక్షలు తీసుకుంటారు. తిరుపతి జిల్లాలో ఏసీబీ దాడుల్లో ఓ మునిసిపల్ కమిషనర్ అడ్డంగా దొరికిపోయాడు. సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ దగ్గర అక్రమంగా ఉన్న రూ. 1.93 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. కార్యాలయంలోకి ఏసీబీ అధికారులు రావడాన్ని గమనించి కిటికీలోంచి నగదును బయటికి విసిరేశాడు కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్.
వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కమిషనర్ పడేసిన నగదును స్వాధీనం చేసుకున్నారు. సూళ్ళూరుపేటలో భవన నిర్మాణం అనుమతుల విభాగంలో అక్రమాలు అధికంగా ఉన్నట్లు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబి తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ ని స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఏసీబీ ఎఎస్పీ వెంకట్రావు, డీఎస్పీ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. భారీగా అవినీతి చోటుచేసుకుంటుందని ఫిర్యాదులు వచ్చాయి. ఎంతమేరకు అవినీతి జరుగుతుందో.. లెక్కలు తేల్చేపనిలో పడ్డారు ఏసీబీ అధికారులు.
Raghunandan Rao: రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి