Kakani Govardhan Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం హైదరాబాద్‌కు వెళ్లారు నెల్లూరు పోలీసులు.. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడంపై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం విదితమే కాగా.. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కాకాణి గోవర్థన్ రెడ్డికి ఆదివారం రోజే పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే నోటీసు ఇచ్చేందుకు ఆదివారం సాయంత్రం పొదలకూరు పోలీసులు నెల్లూరులోని కాకాణి గోవర్దన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు.. అయితే, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు పోలీసులు..
Read Also: Trump: మూడోసారి అధ్యక్షుడ్ని ఎందుకు కాకూడదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అయితే, ఈ రోజు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు నెల్లూరు పోలీసులు.. నిన్న సాయంత్రం నెల్లూరులోని ఇంట్లో కాకాణి లేకపోవడంతో గేట్‌కు నోటీసులు అంటించారు పోలీసులు.. ఇక, హైదరాబాద్‌లోని ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉగాది జరుపుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. దీంతో, కాకాణి.. హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారంతో అక్కడికే బయల్దేరి వెళ్లారు.. అయితే, కాకాణి గోవర్దన్‌రెడ్డికి నోటీసులపై పోలీసులు స్పందించడంలేదు.. కాగా, చెన్నైలో నివాసముండే విద్యా కిరణ్‌కు పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని 32 ఎకరాల్లో రుస్తుం మైన్ పేరిట మైకా తవ్వకాలకు అనుమతి ఉండగా.. లీజు గడువు ముగియడంతో పునరుద్దరణకు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు.. గత ప్రభుత్వ హయాంలో తెల్లరాయి గనులపై ఆ పార్టీ నేతలు కన్నేశారని.. లీజుదారుడు అంగీకరించకపోయినా కొందరు ప్రజాప్రతినిధుల అండతో దౌర్జన్యంగా తెల్లరాయిని తరలించారనే ఆరోపణలు ఉన్నాయి.. అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాణి.. సొంత గ్రామం తోడేరుకు సమీపంలోనే మైనింగ్‌కు పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి.. దీనిపై టీడీపీకి చెందిన మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోన్న విషయం విదితమే..