Somu Veerraju: విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరును సోము వీర్రాజు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో నృత్యం చేసిన చిన్నారి గురించి ప్రస్తావిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటుడు అని.. భరత నాట్యాన్ని అభ్యసించాడని.. బాల రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా అని.. భరత నాట్యంలో ముద్ర, అంగీకం, భంగిమలు వంటివి జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా తెలుసు అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అయితే కళాకారుల గురించి తాను పెద్దగా చెప్పలేనని.. కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తే అందరికీ అర్థమవుతుందని చెప్పానని పేర్కొన్నారు.
Read Also: Football-Sized Tumour: మహిళ కడుపులో ఫుట్‌బాల్ సైజులో కణితి.. తొలగించిన వైద్యులు
మరోవైపు ఏపీ సీఎం జగన్‌పై సోము వీర్రాజు విమర్శలు చేశారు. జగన్‌కు ఉపాధ్యాయుడు అంటే ఎవరో తెలీదని.. విద్యావంతులైన తెలుగు వాళ్లు ప్రపంచం అంతా ఉన్నారని.. ఏ మూలకెళ్లినా కచ్చితంగా పది మందైనా తెలుగు వాళ్లు కన్పిస్తారని.. అలాంటి ఖ్యాతి తెలుగు గడ్డకు ఉందని సోము వీర్రాజు అన్నారు. విద్యకు, ఉపాధ్యాయులకు ఇంత పెద్ద పీట వేసిన రాష్ట్రంలో టీచర్లకు సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్.. ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. ఇప్పుడు సీపీఎస్ గురించి మాట్లాడితే టీచర్లనే కాదు.. వాళ్ల కుటుంబ సభ్యులను జైల్లో వేసేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను పాలకులు అర్ధం చేసుకోవాలని.. జాతి భవిష్యత్తును నిర్దేశించింది ఉపాధ్యాయులే అన్నారు. పెద్ద ఎత్తున చైతన్యం కలిగిన టీచర్ల సంఘాలు ఉన్న ఈ రాష్ట్రంలో వైసీపీకి 151 సీట్లు వచ్చాయన్నారు. జగన్‌కు మంచి బుద్ధి రావాలని టీచర్లు భగవంతుణ్ని కోరుకోవాలని సూచించారు. జగన్ విషయంలో భగవంతుణ్ని కోరుకోవడం మినహా మరే ప్రత్యామ్నాయం లేదని సోము వీర్రాజు అన్నారు.