ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారే.. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరం జిల్లా గరివిడిలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్సపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బొత్స సొంత జిల్లాలోనే రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహాన్ని శిరస్సు ఖండిస్తే దానిపై పోరాడి తిరిగి నూతన విగ్రహాన్ని ప్రతిష్టింప చేసిన ఘనత బీజేపీదే అన్నారు.
Read Also: Karnataka: కారులో నిప్పటించుకుని ప్రేమజంట సజీవ దహనం..
రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం… కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయాణిస్తున్నారని విమర్శించారు సోము వీర్రాజు.. రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంలో బీజేపీ ప్రముఖ పాత్ర పోషించిందన్న ఆయన.. పేదలకు పంచే రేషన్ బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండు రూపాయలు పెడితే, బీజేపీ 30 రూపాయలు పెడుతుందని.. అసలు, రెండు రూపాయలు వాటా పెట్టి బియ్యం పంపిణీ చేయడానికి వాహనం అవసరమా..?, ఆ వాహనంపై సీఎం జగన్ ఫోటో ఎలా వేసుకుంటారు..? అని ప్రశ్నించారు.
40 సంవత్సరాల ఉత్తరాంధ్ర ప్రజల కల విశాఖ రైల్వే జోన్… అది నెరవేర్చింది ప్రధాని నరెంద్ర మోడీయేనని ప్రశంసలు కురిపించారు సోము వీర్రాజు.. రాష్ట్రాన్ని అభివృద్ది చేసింది కేంద్ర ప్రభుత్వం, దమ్ముంటే మంత్రి బొత్స దీనిపై చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు.. కరోనా సమయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది మోడీ ప్రభుత్వమన్న ఆయన.. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు.. అటువంటిది వచ్చే ఎన్నికల్లో గెలిచే అర్హత బీజేపీకి తప్ప ఇంకే పార్టీకి ఉంటుంది..? అని ప్రశ్నించారు. ఇక, వైసీపీ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా కార్యాకర్తలందరూ పనిచేసేందుకు శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు సోము వీర్రాజు.