విజయవాడలో జరుగుతున్న బీజేపీ ప్రజాగ్రహ సభలో ఏపీ సర్కారుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు. కేంద్రం డబ్బిస్తే గ్రామ సచివాలయాలు కట్టి స్తోత్రం.. స్తోత్రం అంటూ జగనన్న జపం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రజాగ్రహ సభ అంటే కొందరికి కాలాల్సిన చోట కాలిందని.. మంత్రి పేర్ని నాని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోవైపు జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకే ప్రజాగ్రహ సభ పెట్టారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అంటున్నారని.. ఈ సభ ద్వారా అందరికీ ఏం చూపించాలో.. అంతా చూపిస్తామన్నారు.
Read Also: బీజేపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్
వైసీపీ, టీడీపీ నేతలు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయో అన్నీ తేలుస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. జగన్ పాదయాత్ర చేస్తే రోడ్లు అరిగిపోయాయి.. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తట్టెడు మట్టయినా వేశారా అని నిలదీశారు. సర్పంచులకు కేంద్రం నిధులిస్తే.. వాటిని లాక్కుంటారా అని మండిపడ్డారు. బీజేపీ నేతలు దేశం అభివృద్ధి చేసే సంస్కారం ఉన్న వాళ్లు అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జగన్ హైదరాబాదులో ఓ లోటస్ పాండ్.. ఇక్కడో పాండ్ కట్టారని.. అధికారంలోకి రాకుండానే అమరావతిలో భవనం కట్టారన్నారు.
బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తే.. ఏపీ విషయంలోనూ పరిశీలిస్తారని సోము వీర్రాజు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని తాము, పవన్ కళ్యాణ్ కేంద్రానికి చెప్పామన్నారు. పేదల కోసం.. ఆవేదన, ఆలోచన కలిగిన పార్టీ బీజేపీ అన్నారు. మడమ తిప్పని వాడు.. మాట తప్పని వాడు.. ఏపీకి రాజధాని లేకుండా చేశారని సోము వీర్రాజు ఆరోపించారు. ఆస్తులను దోచుకునేందుకు విశాఖ చుట్టూ వైసీపీ నేతలు గద్దల్లా తిరిగుతున్నారని విమర్శించారు. ప్రజలు బీజేపీకి అధికారం ఇస్తే మూడేళ్లల్లో రాజధానిని కడతామన్నారు. సింగపూర్‌లా రాజధానిని కడతామని చెప్పిన చంద్రబాబు… రాజధాని రైతులను తిరుపతి వరకు నడిపించాడని మండిపడ్డారు.
ఏపీలో కేంద్రం ఇచ్చే నిధులతోనే నాడు-నేడు అని అమలు చేస్తున్నారని, మధ్యాహ్న భోజనం, ఉచిత విద్యను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని… కానీ జగన్ సర్కారు తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని సోమువీర్రాజు విమర్శలు చేశారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తామన్నవాళ్లు సారా వ్యాపారం చేస్తున్నారని, ప్రభుత్వమే పచ్చి సారా కాస్తోందని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నవరత్నాలు ఇస్తున్నారేమో కానీ తాము అయితే 90 రత్నాలు ఇస్తామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.