Sankranti 2023: హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారింది. సంక్రాంతి పండుగను పల్లెల్లో జరుపుకోవడానికి సొంత గ్రామాలకు లక్షలాది మంది తరలివెళ్లడంతో… జనారణ్యం బోసిపోయింది. ప్రజలు నగరాల నుంచి పల్లె బాట పట్టడంతో… ఆయా హైవేల్లోని టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు కిటకిటలాడాయి. సొంత వాహనాల్లో సొంతూర్లకు వెళ్తుండటంతో…. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ జాతీయ రహదారిలో పతంగి, కొర్లపహాడ్ టోల్‌గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. పతంగి టోల్‌గేట్ వద్ద వాహనాలు అధిక సంఖ్యలో రావడంతో విజయవాడ వైపు గేట్లు తెరిచినప్పటికీ… కిలోమీటరు దూరానికిపైగా వాహనాలు స్తంభించాయి. వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో.. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి. ఒక దశలో ట్రాఫిక్ కిలోమీటరు దూరానికిపైగా నిలిచిపోయింది. ఫాస్టాగ్ విధానం అమలులో ఉన్నప్పటికీ.. వాహనాలు పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్‌లు స్కాన్ కాకపోవడం వంటి కారణాలతో టోల్ గేట్ల దగ్గర పండగ రద్దీ అధికంగా కనిపించింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
మరోవైపు.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం టోల్ గేట్ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంక్రాంతి సెలవులు రావడంతో సొంత ఊళ్లకు బాటపట్టారు. టోల్ గేట్ దగ్గర భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సంక్రాంతికి దారులన్నీ గోదావరి జిల్లాల వైపే సాగుతున్నాయి. దీంతో ఏలూరు టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీ మరింతగా పెరిగింది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి లక్షలాదిమంది జనం సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో టోల్‌గేట్లన్నీ రద్దీగా మారాయి. మరోవైపు ఆర్టీఏ అధికారులు… నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా ఝులిపిస్తున్నారు. పలుచోట్ల స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటుచేసి ప్రైవేట్ ట్రావెల్స్‌ను తనిఖీలు చేశారు. ఇది కూడా వాహనాలు మందకొడిగా సాగడానికి ఒక కారణంగా కనిపించింది. సొంతూళ్లకు జనం పయనం కావడంతో… హైదరాబాద్ నగర రోడ్లు ట్రాఫిక్ ఫ్రీగా మారాయి.