ఏపీ ఉద్యోగులు పిలుపునిచ్చిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. ఉద్యోగ సంఘాలు చేస్తున్న మూడు డిమాండ్లకు కాలం చెల్లిందన్నారు. ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లలో వేతనాలు పడ్డాయని.. వాళ్ల సమస్యలపై ఆందోళనలకు దిగే బదులు ప్రభుత్వం చర్చలకు రావొచ్చని సజ్జల సూచించారు. ఉద్యోగుల కార్యాచరణను ఇప్పటికే వాయిదా వేసుకోవాలని కోరామని.. ఇప్పటివరకు ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రేపు విజయవాడలో ఉద్యోగులు చేసేది ముమ్మాటికీ బలప్రదర్శనే అని సజ్జల ఆరోపించారు. ప్రభుత్వంతో వైషమ్యాలు పెంచుకుని ఉద్యోగులు ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు.
Read Also: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్
ఉద్యోగుల ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే అవకాశం ఉందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకునేవరకు తెచ్చుకోవద్దని సజ్జల హితవు పలికారు. కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు జీతం తగ్గలేదని.. పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదు అని చెప్పడం లేదని, చర్చలకు వచ్చి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని ఉద్యోగులను కోరుతున్నామన్నారు. అటు రాజ్యాంగాన్ని మార్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా సజ్జల స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవచ్చని.. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉండొచ్చని.. దీనిపై చర్చ జరగాలని సజ్జల డిమాండ్ చేశారు.