అమరావతి: ప్రతిపక్ష పార్టీ టీడీపీపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు నుంచి టీడీపీ నేతలకు కడుపు మంట ఎక్కువైందని ఆయన ఎద్దేవా చేశారు. మహానాడు ఘన విజయం అంటూ వాళ్ళకి వాళ్లే బుజాలు చరుచుకుంటున్నారని చురకలు అంటించారు. టీడీపీ నేతలు ఎంతటి పతనావస్థలో ఉన్నారనేది వారి ఏడుపు వల్లే కనిపిస్తోందని సజ్జల ఆరోపించారు. ఏడుపు వాళ్ళ అధికారిక గీతం అయ్యిందని.. అసెంబ్లీ నుంచి చంద్రబాబు ఏడుపు ప్రారంభమైందని సజ్జల విమర్శించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధికారంలో సీఎం జగన్ వాటా ఇవ్వడం, కృతజ్ఞతతో బస్సు యాత్రకు ప్రజలు జైజైలు పలికితే చంద్రబాబుకు ఏడుపు వస్తుందని సజ్జల వ్యాఖ్యానించారు. కరోనా వల్ల ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తిన్నా సంక్షేమాన్ని అమలు చేసిన నాయకుడు జగన్ అని ఆయన తెలిపారు. సీఎం జగన్ దావోస్ పర్యటనపైనా టీడీపీ విష ప్రచారం చేసిందని సజ్జల ఆరోపించారు. బీసీ మంత్రుల బస్సు యాత్రను చూసి ఓర్వలేకపోయారన్నారు. మహానాడులో అన్నీ అబద్ధాలే చెప్పారని ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు దావోస్ వెళ్తే ఆహా ఓహో అన్నట్లు బిల్డప్ ఇచ్చారని.. కానీ దావోస్‌నే రాష్ట్రానికి తెస్తానంటూ జగన్ ఏనాడూ బిల్డప్‌లు ఇవ్వలేదని సజ్జల గుర్తుచేశారు. దావోస్‌లో జరిగిన ఒప్పందాలపై కూడా టీడీపీ నేతలు ఏడుస్తున్నారంటూ విమర్శించారు. 14 సార్లు దావోస్ వెళ్లిన చంద్రబాబు ఏం తీసుకొచ్చాడని నిలదీశారు.
టీడీపీ నేతలతో ప్రశ్నించుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ దిగజారలేదని సజ్జల అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికీ మీకు ఇది ఇచ్చాం అని చెబుతున్న ధీమా టీడీపీ నేతలకు ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు. ఆనాడు రుణమాఫీ గురించి ఎన్నికల కమిషన్ అడిగితే ఎలాగోలా చేస్తాం అన్నారని.. ఆ తర్వాత కోత వేసి రైతులను మోసం చేశారని సజ్జల ఆరోపించారు. ఒక పరిణితి చెందిన నాయకుడిలా జగన్ వ్యవహరిస్తున్నారని.. ఇంత వరకు జగన్ దావోస్ వెళ్లి వచ్చాక ఒక్క మాట మాట్లాడలేదని.. అదేమన్నా అంటే ఇండియన్ కంపెనీ అంటారు… ఇండియన్ కంపెనీలవి డబ్బులు కావా అని సజ్జల ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కేవలం నగదు బదిలీ ద్వారా లక్ష కోట్లకు పైగా ఇచ్చిందన్నారు. అన్నా క్యాంటీన్, చంద్రన్న కానుక పథకాలను ఎత్తేశామంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని.. చంద్రన్న కానుక పథకాన్ని హెరిటేజ్ కోసమే పెట్టుకున్నారని సజ్జల ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వార్ వన్ సైడే అంటాడని.. ఒంటరిగా రావయ్యా అంటే మాత్రం నోరు మెదపడని సజ్జల విమర్శించారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో టీడీపీకి దమ్ముంటే అభ్యర్థిని పెట్టాలని.. అప్పుడు ప్రజలు ఎవరిని ఆమోదిస్తున్నారో తేలిపోతుందన్నారు. రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సజ్జల సవాల్ విసిరారు. ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ అమలు చేయని పథకాలు ఏవైనా ఉంటే చంద్రబాబు చూపించాలన్నారు. దాదాపు 95 శాతం అమలు చేశామని.. ఇంకా 5 శాతం మాత్రమే చేయాల్సినవి ఉన్నట్లు తెలిపారు. టీడీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము మూడేళ్లలో చేసి చూపించామని.. రానున్న రెండేళ్లలో మరింత ముందుకు వెళ్తామన్నారు. అక్రమాలు చేస్తే ప్రభుత్వానికి రెవిన్యూ రాదని.. కానీ తమ హయాంలో రెవెన్యూ పెరిగిన విషయంపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
మద్యపానాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. జగన్ బెల్టు షాపులు తీసేసి రెవిన్యూ పెంచారని.. కానీ చంద్రబాబు బెల్ట్ షాపులు పెట్టినా రెవెన్యూ రాలేదన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తామని ఆనాడు చంద్రబాబు చేసిందేంటో అందరికీ తెలుసన్నారు. ఎంవోయూలు కేవలం ఒప్పందాలు మాత్రమే అని.. వాటినే ఆధారంగా తాము తీసుకోదల్చుకోలేదన్నారు. భవిష్యత్తులో వాటిని అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఉందని సజ్జల అభిప్రాయపడ్డారు.