ఏపీలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏసీబీ యాప్ తయారు చేసింది. ‘ఏసీబీ 14400’ పేరుతో యాప్ రూపొందించింది. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనపై సమీక్ష కార్యక్రమంలో ఏసీబీ యాప్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి ఉండకూడదని స్పష్టంగా చెప్పామని.. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రూ.1.41 లక్షల కోట్లను అవినీతి లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపామని ఆయన గుర్తుచేశారు.
ఎక్కడైనా, ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ 14400 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని బటన్ ప్రెస్ చేసి వీడియో లేదా ఆడియో సంభాషణను రికార్డు చేస్తే ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందని సీఎం జగన్ వెల్లడించారు. దీంతో ఏసీబీ నేరుగా సీఎంవోకు నివేదిస్తుందని తెలిపారు. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉందన్నారు. అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని.. మన స్థాయిలో అనుకుంటే 50శాతం అవినీతి అంతం అవుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని.. అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యమని పేర్కొన్నారు. ఎవరైనా అవినీతి చేస్తూ పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని సీఎం జగన్ హెచ్చరించారు.
ఏసీబీ యాప్ ఎలా పనిచేస్తుంది?
తొలుత పౌరులందరూ గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ సమయంలో మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రిజిస్టర్ చేయగానే వినియోగానికి యాప్ సిద్ధంగా ఉంటుంది. ఈ యాప్‌లో 2 కీలక ఫీచర్లు ఉంటాయి. యాప్ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్ రిపోర్ట్ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదు కోసం ప్రతి ఒక్కరూ తన దగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం ఉంది. ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్‌కు రిఫరెన్స్ నంబరు వస్తుంది. కాగా త్వరలో ఐఓఎస్ వెర్షన్‌లోనూ ఈ యాప్‌ను సిద్ధం చేస్తామని ఏసీబీ వెల్లడించింది.