వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య సీఎం జగన్‌ను ఎంతో కుంగదీసిందని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యపై కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. సీబీఐ ఛార్జ్‌షీట్ పేరుతో కేసుతో సంబంధం లేని వారిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కేసు వార్త విషయంలో ప్రభుత్వ సలహాదారుగా కాకుండా.. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నానని చెప్పారు.
వివేకా హత్య కేసులో అందరూ వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్న తరుణంలో సీబీఐ ఛార్జ్‌షీట్ పేరుతో తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని సజ్జల మండిపడ్డారు. వివేకా హత్యకు జరిగిన కుట్ర కన్నా ఇది హేయమైన కుట్రగా కనిపిస్తుందన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి విజయం కోసం వైఎస్ వివేకా ప్రచారం చేశారని గుర్తుచేశారు. శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేసి చెప్తేనే అవినాష్ రెడ్డి వివేకా ఇంటికి వెళ్లారని సజ్జల తెలిపారు. వైఎస్ కుటుంబం, వైసీపీ పార్టీ, ఎంపీ అవినాష్‌రెడ్డి పరువు తీయాలనే తపన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మార్చి 15న హత్య జరగ్గా.. మే 30 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, సిట్ రికార్డులన్నీ అక్కడే ఉన్నాయని గుర్తుచేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక అదే అధికారులు కొనసాగిన విషయం మరిచిపోవద్దన్నారు. కొందరి పేర్లు చెప్పాలంటూ సీబీఐ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని అనుమానితులు ఆరోపిస్తున్నారంటే కుట్ర ఎలా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చని సజ్జల వివరించారు.