విశాఖలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాష్ నగర్‌లో రౌడీ షీటర్ దోమాన చిన్నారావును స్థానిక మహిళలు చితకబాదారు. స్కూల్‌కు వెళ్లే అమ్మాయిలకు పెన్నులు, పెన్సిళ్లు ఇస్తూ చిన్నారావు వారికి ఆశ చూపించాడు. దీంతో కొందరు విద్యార్థినులు చిన్నారావు మాటలు నమ్మి అతడి దగ్గరకు వెళ్లారు. కానీ ఇదే అదనుగా భావించిన చిన్నారావు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో స్థానిక మహిళలందరూ కలిసి రౌడీషీటర్ చిన్నారావుకు బడితెపూజ చేశారు. అనంతరం మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రౌడీ షీటర్ చిన్నారావును కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.