ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి చర్యలపై కోర్టు స్టే విధించింది. వారం క్రితం చింతపూడిలో ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఓ గొడవ చోటు చేసుకుంది. ఆ సందర్భంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో కోర్టుని ఆశ్రయించిన ప్రభాకర్, ఎస్టీ – ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేలా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు. వాదనలు విన్న కోర్టు, కేసులో తదుపరి చర్యలపై స్టే విధిస్తూ.. విచారణకు వాయిదా వేసింది.
Read Also: APSRTC: ‘ప్రైవేట్’ ఆర్టీసీపై క్లారిటీ ఇచ్చిన ఎండీ
అసలేం జరిగింది?
కాగా.. గత సోమవారం రాత్రి చింతపూడి మండలం ప్రగడవరం పంచాయతీ అంకంపాలెంలో నిర్వహించిన బాదుడే బాదుడే కార్యక్రమంలో.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభాకర్ మాట్లాడారు. ఆ సమయంలో వైసీపీ నాయకులు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో కలిసి అక్కడికి వెళ్ళారు. తమ నాయకుడ్ని అవమానించేలా మాట్లాడుతారా? అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంలో ప్రభాకర్ తనను కులం పేరుతో దూషించారని సర్పంచి తొమ్మండ్రు భూపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.