భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులకు గండ్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల వరద బీభత్సానికి రహదారులు కొట్టుకుపోయాయి. మరి కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. దీంతో రైళ్లను కూడా రద్దు చేశారు. నిన్నటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ఉదృతి తగ్గింది. ఇన్ ఫ్లో లక్షా 93వేల 710 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో రెండు లక్షల 1516 క్యూసెక్కులుగా ఉంది.
12 గేట్ల ద్వారా పెన్నా నదికి నీటి విడుదల చేస్తున్నారు. అయితే అనంతపురంలో భారీ వర్షానికి ఉరవకొండ-చీకలగురికి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ధాటికి కల్వర్టు ధ్వంసం కావడంతో రోడ్డు తెగిపోయింది. ఇదిలా ఉంటే.. విశాఖపట్నం యారాడ బీచ్ లో 3 రోజుల క్రితం గల్లంతైన నొల్లి వినయ్( 16) మృతదేహం ఆచూకీ లభ్యమైంది. గంగవరం గ్రామం బండ రాళ్ళ మధ్య ఉండిపోవటం నీరు వెనక్కి వెళ్ళిపోవటంతో విద్యార్ది మృతదేహం కనిపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూపోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.