Andhra Pradesh: అభివృద్ధి వికేంద్రీకరణే ధ్యేయంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 5న కర్నూలు వేదికగా రాయలసీమ గర్జన జరగనుంది. ఎస్టీబీసీ గ్రౌండ్స్‌లో రాయలసీమ గర్జనను భారీగా నిర్వహించాలని నాన్ పొలిటికల్ జేఏసీ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం అన్నది చారిత్రాత్మక అవసరమని.. అంతేకాకుండా రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమతుల్య అభివృద్ధికి ఇది అత్యంత ఆవశ్యకమని నాన్ పొలిటికల్ జేఏసీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
Read Also: Droupadi Murmu: ఏపీలో 2 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన.. షెడ్యూల్ ఇదే
1937లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నాయకుల మధ్య జరిగిన చారిత్రాత్మక శ్రీబాగ్ ఒడంబడిక మేరకు ఏపీ హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాల్సి ఉందని నాన్ పొలిటికల్ జేఏసీ గుర్తుచేస్తోంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాద సంఘాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మేరకు ఈనెల 5న కర్నూలులో రాయలసీమ గర్జన నిర్వహిస్తున్నామని రాయలసీమ అడ్వకేట్స్ జాయింట్ కన్వీనర్ వై.జయరాజు వెల్లడించారు. లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీనికి అనుగుణంగా నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో విశాఖలో నిర్వహించిన సభను తలదన్నేలా రాయలసీమ గర్జన నిర్వహించనున్నారు. రాయలసీమ గర్జన కార్యక్రమానికి వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, చట్టసభల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు ఆవిష్కరించారు. కాగా గతంలో కర్నూలు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉండేది. ఇప్పుడు మరోసారి ఏపీకి న్యాయరాజధానిగా మారబోతుందని వైసీపీ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు.
కాగా రాష్ట్రంలో టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు హైకోర్టును కర్నూలు తరలించేందుకు సంపూర్ణ సమ్మతి తెలియజేసినందున రాజకీయ ఇబ్బందులు లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశానికి ఆమోదముద్ర వేయాలని నాన్ పొలిటికల్ జేఏసీ కోరుతోంది. ఈ సమావేశంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేసింది.