Andhra Pradesh: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వచ్చిన ఆమె.. ఈసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. ఈనెల 4న ఢిల్లీ నుంచి ఆమె విజయవాడ చేరుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వివరాలను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా వెల్లడించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్ము బయలుదేరి ఉదయం 10:15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ఆమె హజరవుతారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్రభుత్వం తరఫున సన్మానిస్తారు. అనంతరం రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ హరిచందన్ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. ఆదివారం సాయంత్రం విశాఖలో జరిగే నేవీ డే ఉత్సవాలలో ఆమె పాల్గొంటారు. రక్షణ దళాల సుప్రీం కమాండర్‌గా ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై నేవీ విన్యాసాలను తిలకిస్తారు. ఇదే వేదికపై నుంచి రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేస్తారు.
Read Also: JNU: జేఎన్‌యూలో మరో వివాదం.. క్యాంపాస్‌లో బ్రహ్మణ వ్యతిరేక నినాదాలు
అటు ఆదివారం రాత్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ నుంచి తిరుపతి వెళ్లనున్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అక్కడి గోశాలను సందర్శిస్తారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. తిరుపతి నుంచి సోమవారం మధ్యాహ్నం బయలుదేరి నేరుగా ఢిల్లీ చేరుకుంటారు.