ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యను పరష్కరించడంలో భాగంగా తాజాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) మీటింగ్ జరిగింది. ఇందులో భాగంగా.. పవర్ జనరేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరంపై తాము రాజీ పడేదే లేదని తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి తేల్చి చెప్పారు. శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేస్తున్నారని ఏపీ అభ్యంతరం చెప్పారని, విద్యుత్ అవసరాల కోసం తాము కచ్ఛితంగా ఉత్పత్తి చేస్తామని, ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. డీపీఆర్ సబ్మిట్ చేయాలని అడుగుతున్నారని, అందుకు కాస్త సమయం ఇవ్వాలని ఆయన కోరారు.
2015 నుంచి తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 TMCలు తాత్కాలిక కేటాయింపు చేశారన్నారు. 30 లక్షల ఎకరాల భూమికి సాగు నీరు అందించాల్సిన అవసరం ఉందని.. తెలంగాణ డిమాండ్ చేసినట్లు 50 శాతం కృష్ణాజలాలు కేటాయింపు చేయలేము బోర్డ్ తేల్చి చెప్పింది. ఈసారి 66:34 నిష్పత్తిలో నీటి పంపిణీకి అంగీకరించలేమని చెప్పేశారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (కేఎల్‌బీసీ), నెట్టెంపాడు ప్రాజెక్ట్స్ ఉన్నాయని.. ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక నీటి అవసరాలు పెరుగుతాయన్నారు. మిగులు జలాలపై సబ్ కమిటీ వేయాలని నిర్ణయించామని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవని, డీటెయల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌పై బోర్డ్ ఛైర్మన్‌కి వివరించామని రజత్ కుమార్ వెల్లడించారు.