ఒకవైపు మండే ఎండ, మరోవైపు హఠాత్తుగా చిరుజల్లులతో వాతావరణం చల్లబడుతోంది. ఎండలో తిరిగి అలసిన వారికి చిరుజల్లులు ఉపశమనం కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, రాయలసీమ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో మాత్రం ఎండలు మండుతాయని జాగ్రత్తగా వుండాలని ఐఎండీ సూచించింది. 26వ తేదీ వరకు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటికి రావొద్దని స్పష్టం చేసింది. వృద్ధులు, మహిళలు, గర్భవతులు ఇళ్లకే పరిమితం కావాలని, ప్రజలు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రవాలు తీసుకోవడం మేలని సూచించింది.
మండువేసవిలో మేఘసందేశం ప్రజలకు ఊరటనిస్తోంది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో పిడుగులు పడి నలుగురు చనిపోయారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడికి ఇబ్బంది పడ్డ నగరవాసులను సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. తెలంగాణ జిల్లాల్లోనూ అక్కడక్కడ చినుకులు పడ్డాయి. సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పటాన్‌చెరు, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్, అమీన్‌పూర్‌లో తీవ్రస్థాయిలో ఈదురుగాలులు వీచాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో వడగండ్ల వర్షం కురిసింది.
Read Also: Ram Charan : నడిచే నేల, పీల్చే గాలీ, బతుకుతున్న దేశం వారి త్యాగమే !
ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ వడగండ్ల వానలు, పిడుగులు జనాన్ని బెంబేలెత్తించాయి. కర్నూలు జిల్లాలో అకాల వర్షాలు నలుగురి ప్రాణాలు తీశాయి. పిడుగుపాటుకు వేరువేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళతోపాటు నలుగురు మృతిచెందారు. పొలం పనులు చేసుకుంటుండగా… పిడుగుపడటంతో ఆదోని మండలం కుప్పగళ్లులో ఉరుకుందమ్మ, లక్ష్మమ్మ… హొళగొంద మండలం వండవాగిలిలో తాయన్న, చంద్రన్న ప్రాణాలు కోల్పోయారు.