Raghuveera Reddy: ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు దూరంగానే ఉంటానని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం ఆలయ నిర్మాణం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాజకీయాల్లో తన యథాస్థితి కొనసాగుతుందన్నారు. అయితే అనంతపురం జిల్లాలో త్వరలో జరిగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని రఘువీరారెడ్డి తెలిపారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి తీర్థప్రసాదాలు అందజేస్తానని పేర్కొన్నారు. ఆ తరువాత తన గ్రామంలోనే ఉంటానని చెప్పారు.
Read Also: Buggana Rajender : ప్రభుత్వం మేలు చేస్తున్నా ప్రతిపక్షం విమర్శిస్తోంది
కాగా కొద్దిరోజుల కిందట రఘువీరారెడ్డి టీడీపీలో చేరతారంటూ పుకార్లు చెలరేగాయి. వచ్చే ఎన్నికల నాటికి రఘువీరారెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని.. ఆయన టీడీపీలో చేరడం ఖాయమని కొందరు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేశారు. అయితే తాజాగా తన రాజకీయ ప్రస్థానంపై రఘువీరారెడ్డి క్లారిటీ ఇవ్వడంతో గతంలో వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని స్పష్టమవుతోంది. కాగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశించనుంది. ఏపీలో 90 కి.మీ. మేర రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.