ప్రభుత్వం మేలు చేస్తున్నా ప్రతిపక్షం విమర్శిస్తోందన్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షం విజయవంతంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపారని ఆయన ఆరోపించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మూడేళ్ళుగా మొదటి స్థానంలో ఉందని మంత్రి బుగ్గన వెల్లడించారు. హైద్రాబాద్-బెంగుళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ టీడీపీ సాధించలేకపోయినా వైసీపీ ప్రభుత్వం సాధించిందని బుగ్గన తెలిపారు. ఓర్వకల్ ఇండస్ట్రీయల్ నోడ్ దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీయల్ పార్కుల్లో ఒక్కటని మంత్రి బుగ్గన వివరించారు.
ఇండస్ట్రీయల్ పార్కుకు 52 కి.మీ పైప్ లైన్ ద్వారా ఒక టీఎంసీ నీటిని తెస్తున్నామని, 4 వేల పై చిలుకు ఎకరాల భూమి నీరు అందనుందని, చంద్రబాబు చీకట్లో పరిగెత్తి ఏదేదో చేశారని ఆయన విమర్శించారు. చంద్రబాబు అద్దెకు తెచ్చిన కోట్లు వేసుకున్న వారిని తెచ్చి ఇండస్ట్రీయల్ మీట్ పెట్టారంటూ మంత్రి బుగ్గన విమర్శించారు. చంద్రబాబు అరటి తోటలో సింగపూర్ నిర్మించారన్నారు. కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, అనుమతి వచ్చిన కర్నూలులో హైకోర్టు రాబోతుందని, ఓర్వకల్ లో మల్లికార్జున రిజర్వాయర్ ఏర్పాటుకు సీఎం జగన్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన వెల్లడించారు.