వైసీపీ తరఫున తెలంగాణ నుంచి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఆర్.కృష్ణయ్య రెండో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయటానికి అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు సిగ్గుండాలని.. సీఎంగా పనిచేసిన ఆయన తన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన కులాల కోసం మొదటి నుంచి పోరాటం చేస్తోంది తానేనని ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీ సబ్ ప్లాన్‌తో పాటు అన్ని రంగాల్లో బీసీల అభివృద్ధికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
జగన్ అన్ని రంగాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. జగన్‌ను విమర్శించే ముందు చంద్రబాబు అసలు బీసీలకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు చెందిన సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్‌లను రాజ్యసభలకు పంపించారని.. ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన తనను రాజ్యసభకు పంపితే తప్పేముందని ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు.