ఏపీలో రాష్ట్రపతి ఎన్నికల (President elections) పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జులై 18న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలో దింపగా.. విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించనుంది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది పోలింగ్. కేంద్ర బృందం పోలింగ్ కి సంబంధించిన పనులను పర్యవేక్షించింది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అబ్జర్వేషన్ టీంలో చంద్రేకర్ భారతి, సంతోష్ అజ్మీరా వున్నారు.
పోలింగ్ ఏర్పాట్లను సెంట్రల్ అబ్జర్వేషన్ టీంకు వివరించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా. పోలింగ్ ఏర్పాట్లపై సీఈఓ మీనాతో కేంద్రం బృందం భేటీ అయింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ లో పాల్గొనాలని అధికారులు సూచించారు. ఇక 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు 50 మందికి పైగా అసెంబ్లీ సిబ్బందిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 151 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఒకరు జనసేనకు చెందిన వారు సభ్యులుగా వున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 25 ఉండగా, ఇందులో 22 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు, ముగ్గురు టీడీపీ ఎంపీలున్నారు. రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇందులో వైసీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఏపీలో మొత్తం 36 మంది ఎంపీల ఓటు విలువ 25,488గా వుంది. అలాగే, 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825గా వుంది. రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ 53,313 అనీ, ఇందులో వైఎస్సార్‌సీపీ వాటా 45,957గా వుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు విపక్షం టీడీపీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధికంగా ఓటు వేసేది అధికార వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే. ఈ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు 22 మంది, రాజ్యసభలో మరో 9 మంది ఎంపీలకు కలిపి మొత్తం ఓటు విలువ 21,948 కాగా, 151 మంది ఎమ్మెల్యేలకు 24,009 ఓటు విలువ ఉంది. అంటే రాష్ట్రం నుంచి ఉన్న మొత్తం 53,313 ఓటు విలువలో వైఎస్సార్‌సీపీ 45,957 ఓటు విలువగా వుంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. ఈ మేరకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్నారు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్న మహిధర్ రెడ్డికి అక్కడే ఓటువేసే అవకాశం కల్పించింది ఈసీ.
Etela Rajender : ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం