Droupadi Murmu: ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నాడు నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం.. వరాహ స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి దర్శనానికి ఆలయ మహాద్వారం చేరుకుని అక్కడి నుంచి తిరుమలేశుడి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలతో రాష్ట్రపతిని సత్కరించారు. శ్రీవారి దర్శనం తర్వాత అలిపిరి వద్ద ఉన్న గో మందిరాన్ని సందర్శించిన అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి బయలుదేరి వెళ్లారు.
Read Also: Custard Apple Leaves: సీతాఫలం ఆకులతో వ్యాధులకు చెక్.. ఎలాగంటే..
కాగా ఆదివారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వం తరఫున విజయవాడలో పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తుచేశారు. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆమె ప్రశంసలు కురిపించారు.

