నిన్నటి వరకు ఆ ఊరు ప్రశాంతంగా ఉండేది.. హత్యలు.. రక్తపాతం అన్నది కనిపించలేదు.. కానీ ఒక్కసారిగా జంట హత్యలతో ఆ ఊరు ఉలిక్కి పడింది. అది కూడా పట్టపగలు కొందరు చూస్తుండగానే ఒక భూస్వామిని దారుణంగా గొంతు కోసి చంపారు. అడ్డొచ్చిన అతని డ్రైవర్ ను కూడా అంతే దారుణంగా చంపారు. సరిగ్గా 14ఏళ్ల క్రితం.. ఇదే తరహాలో జరిగిన జంట హత్యలకు దీనికి ఏమైనా లింక్ ఉందా.. అసలు ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు.. అంత పగలు ఏమున్నాయి. అది అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం.. సమయం సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది.. రాయల్ ఫంక్షన్ హాల్ వెనుక వైపు ప్రాంతం. నిత్యం జన సంచారం ఉంటుంది. అలాంటి చోట ఒకింట్లో ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి.. అక్కడ ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేసి పారిపోయారు. ఈసంఘటనతో గుంతకల్లు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకీ ఏం జరిగింది. అక్కడ హత్యకు గురైంది ఎవరు?
హేమకోటిరెడ్డి.. గుంతకల్లులోని ఆర్టీసీ బస్టాండ్ ఆర్టీసీ సమీపంలోని రాయల్ ఫంక్షన్ హాలు వెనుక భాగాన నివాసం ఉంటున్నారు. ఆయన ఒక భూస్వామి. హేమకోటిరెడ్డికి భార్య డాక్టర్ సరోజమ్మ, కుమారుడు ప్రశాంతిరెడ్డి, కుమార్తె లీనా ఉన్నారు. వీరిద్దరూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. సరోజమ్మ దంపతులిద్దరూ ఇటీవల అమెరికా వెళ్లారు. 15 రోజుల క్రితమే హేమకోటిరెడ్డి గుంతకల్లుకు తిరిగొచ్చాడు. భూస్వామి కావడంతో ఆర్థికంగా బాగా ఉన్న వ్యక్తి. ఎవరితోనూ గొడవలు పడే మనస్థత్వం కాదు. అమెరికా వెళ్లి వచ్చిన తరువాత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఇంట్లో పని మనిషి, డ్రైవర్ మాత్రమే ఉంటారు..
ఇది ఇలా ఉండగా.. మంగళవారం సాయంత్రం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వద్దకు వచ్చి బయటి నుంచి ‘రెడ్డి’ అంటూ కేకలు వేశారు. పని మనిషి వహిదా బయటకు వచ్చి చూసి ఎవరు మీరంటూ ప్రశ్నించింది. తమను పాత గుంతకల్లుకు చెందిన రాము పంపాడని, ఓ సమస్య కోసం రెడ్డి వద్దకు వచ్చామంటూ పేపర్లు చూపారు. దీంతో ఆమె వారిని లోపలికి అనుమతించి.. ఇంట్లోకి వెళ్లిపోయింది. వచ్చిన వ్యక్తులు హేమకోటిరెడ్డితో మాట్లాడుతూనే ఒక్కసారిగా కత్తులను బయటకు తీశారు. దీనిని కోటిరెడ్డి గమనించే లోపు దారుణంగా గొంతు కోశారు. దీంతో కోటిరెడ్డి రక్తపు మడుగులో కింద పడిపోయాడు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది. కోటిరెడ్డి అరుపులు వినిపించడంతో ఇంట్లోనే ఉన్న డ్రైవర్ కావలి వెళ్లి దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అయితే షేక్షావలిని కూడా కత్తులతో పొడుచుకుంటూ బయటకు లాక్కొచ్చి పడేసి వెళ్లిపోయారు. వంట పనిలో నిమగ్నమైన పనిమనిషి వహిదా వచ్చి చూడగా ఆమె పైనా దాడికి యత్నించారు. దీంతో ఆమె గది తలుపులు వేసుకుంది. దీంతో దుండగులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. దీనిని ఇంటి ముందు ఉన్న ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటినా అక్కడికి చేరుకుని హత్య జరిగిన తీరుని పరిశీలించారు.
Read Also: Pavitra: మా నాన్న చనిపోయాడని తెలిసి సంతోషించా.. జబర్దస్త్ నటి సంచలన వ్యాఖ్యలు
ఈ సంఘటనలో ఒక విషాదం కూడా ఉంది. ఇక్కడ హత్యకు గురయిన షేక్షావలి.. వంట మనిషి వహిదా కుమారుడే. ఈ సంఘటనలో డ్రైవర్ చేసిన త్యాగం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. వాస్తవంగా డ్రైవర్ షేక్షావలి ఈమధ్యే ఉద్యోగంలో చేరారు. వహిదా విజ్ఞప్తి మేరకు కోటిరెడ్డి అతన్ని పనిలో పెట్టుకున్నాడు. హత్యచేయడానికి వచ్చిన వారు యజమానిని చంపడానికి ప్రయత్నించగా.. ఇతడు వారి కాళ్లు పట్టుకుని ఆయనను చంపవద్దంటూ బతిమాలిడినట్టు తెలుస్తోంది. ఓవైపు యజమానిని కాపాడాలని ప్రయత్నిస్తూనే.. మరోవైపు హంతకులు తన తల్లి వహిదాను గదిలోకి పంపి తలుపునకు గడియ పెట్టాడు. డ్రైవర్ ఎంత బతిమలాడినా వినని హంతకులు కోటిరెడ్డిని చంపేశారు. అడ్డు వెళ్లినందుకు ఇతడిని కూడా చంపేశారు. ఇతడికి ఆరునెలల కిందటే వివాహమైంది. ప్రస్తుతం భార్య రెహెనా ఐదు నెలల గర్భిణి. ఇటీవలే పుట్టినరోజు వేడుకను ఇంటిలో ఘనంగా నిర్వహించుకున్నారు. షేక్షా తల్లి కొన్నాళ్ల నుంచి కోటిరెడ్డి ఇంటిలో వంటమనిషిగా పనిచేస్తోంది.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గుంతకల్లు పట్టణంలో ఇంతటి దారుణం ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడలేదు. అందుకే పోలీసులు కూడా దీనిని సీరియస్ గా తీసుకున్నారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప మంగళవారం రాత్రి పరిశీలించారు. హత్యకు దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. కాగా హంతకులు సీసీ కెమెరాల ఫుటేజీ రికార్డయ్యే హార్డ్ డిస్క్ ను ఎత్తుకుపోయారు. అంటే నిందితులు పక్కా ప్లాన్ తోనే వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. హేమకోటిరెడ్డి ఇంటి సమీపాన ఉన్న షాపుల సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురు హత్య చేయడానికి వచ్చారని, ఇద్దరు లోపలికి వెళ్లగా మరో ముగ్గురు బయట కాపలాగా ఉన్నట్లు వెల్లడైంది. కానీ కోటిరెడ్డి హత్య చేయడానికి కారణాలు ఏంటన్నది పరిశీలిస్తే.. ప్రధానంగా ఆస్తి వివాదమే కారణంగా తెలుస్తోంది. కోటిరెడ్డికి దాయాదులతో కొన్నేళ్లుగా ఆస్తి వివాదాలు ఉన్నట్లు సమాచారం. 2009లో కోటిరెడ్డి అన్న నీలకంఠారెడ్డి, ఆయన అనుచరుడు ఒకేసారి హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల తర్వాత తన అన్న తరహాలోనే కోటిరెడ్డి కూడా హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది…
ఇది కచ్చితంగా ఆస్తి వివాదాల నేపథ్యంలోనే జరిగిందని.. అందునా తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కొన్ని ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి ఈ జంట హత్యలు మాత్రం జిల్లాలో చాలా రోజుల తరువాత పోలీసులను పరుగులు పెట్టించాయి.