ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో సంచలనం సృష్టించిన తల్లీ కూతుళ్ల హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. ఓ మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తులో ఒక అడుగు ముందుకు వేశారు. తల్లీ కూతుళ్ల హత్యను నరహంతక ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో ఇంట్లో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. హత్య ప్రదేశంలో సేకరించిన వేలిముద్రలతో పాటు బూటు గుర్తులతో నేరస్తుల గుట్టురట్టు అయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మొబైల్ నంబర్ ఆధారంగా మహారాష్ట్ర లోని షోలాపూర్ లో ఓ మైనర్ సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని జిల్లాకు తీసుకువస్తున్నామని పోలీసులు తెలిపారు.
హత్య జరిగిన ప్రాంతంలో డాగ్ స్క్వాడ్ తిరిగిన ప్రదేశాల్లో సీసీ కెమెరా ఫుటేజీని ఇప్పటికే సేకరించిన పోలీసులు. అనుమానిత వ్యక్తుల సంచారం పై ఆరా తీస్తున్న పోలీసులు. గత నెల ఇంకొల్లు మండలం పూసలపాడులో జరిగిన హత్యలకు ఈ హత్యలకు దగ్గర పోలికలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. రెండు చోట్లా ఒకే మొబైల్ నంబర్ వాడిన కీలక నిందితుడు తిరిగినట్లు ఆధారాలు సేకరించామని పోలీసులు తెలిపారు. రెండుసార్లు కర్రల లోడుతో వెళ్తున్న వాహనంలోనే నిందితులు తప్పించుకుని వెళ్లినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిందితులను రహస్య ప్రదేశంలో విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పోలీసుల వర్గాలు వెల్లడించాయి.