నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన బీ ఫార్మసీ విద్యార్థుల నిర్వాకం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్(28)కు వివాహమైంది. అయితే పెళ్లయిన ఆరునెలలకే భార్య విడిచి వెళ్లిపోయింది. దీంతో శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒంగోలులో ఉంటున్నాడు. అతడికి విశాఖకు చెందిన మోనాలీసా అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఆరునెలల కిందట శ్రీకాంత్, మోనాలిసాలకు ఓ యాప్ ద్వారా నెల్లూరులోని బీఫార్మసీ విద్యార్థులు పరిచయం అయ్యారు. అయితే శ్రీకాంత్ హిజ్రాగా మారాలని నిర్ణయం తీసుకోవడంతో శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బీఫార్మసీ విద్యార్థులు తామే తక్కువ ఖర్చుతో ఈ ఆపరేషన్ చేస్తామని ముందుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ఈనెల 23న నెల్లూరులోని ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకుని మస్తాన్, జీవా అనే బీ ఫార్మసీ విద్యార్థులు మోనాలీసా సాయంతో శస్త్ర చికిత్స ప్రారంభించారు. శ్రీకాంత్ మర్మాంగాన్ని వాళ్లు తొలగించడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. పల్స్ పడిపోవడం, మోతాదుకు మించి మందులు వాడటంతో కొద్దిసేపటికే శ్రీకాంత్ చనిపోయాడు. దీంతో నిందితుడు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతుడి వద్ద లభించిన ఆధారాలతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి విచారణ చేపట్టారు.