Deputy CM Pawan: పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ రెండు మండలాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ జరగడం ద్వారా ప్రజా తీర్పు వెలువడిందని అన్నారు. కూటమి బలపరిచిన టీడీపీ లతారెడ్డి, ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించడం ఆయా మండలాల ప్రజలకు ఆనందాన్ని కలిగించిందన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల ప్రాంతంలో నామినేషన్లే వేయనీయకుండా దాడులు, బెదిరింపులు జరిగాయని చెప్పుకొచ్చారు. అయితే, ఈసారి నియమావళి ప్రకారం నామినేషన్లు, ప్రచారం, పోలింగ్ జరగడంతో.. మూడు దశాబ్దాల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయగలిగారని పవన్ పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi: రాజీవ్ గాంధీపై ‘చనిపోయిన వ్యక్తి’ పోటీ చేశారు.. రాహుల్‌గాంధీకి ఈ కథ తెలియదా..?
ఇక, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నియమావళి ప్రకారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. అభ్యర్థులు ప్రచారాలు చేసుకొన్నారు.. ప్రశాంతంగా పోలింగ్ సాగింది.. ఎన్నికల నిర్వహణ మూలంగా ప్రజా తీర్పు స్పష్టంగా వెలువడిందని చెప్పారు. ఈ ప్రక్రియ ఇష్టం లేని పార్టీ ప్రతి దశలో కవ్వింపు చర్యలకు దిగింది.. ఎన్నికలు శాంతియుతంగా సాగటం నచ్చక, అసహనంతో ప్రభుత్వంపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు.. ప్రభుత్వ అధికారులు, పోలీసులు సంయమనంతో వ్యవహరించారు.. కాబట్టి, హింసకు తావు లేకుండా ఎన్నికలు జరిగాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.