ఏపీ ప్రభుత్వం 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయగా…. ప్రజాభిప్రాయ సేకరణలో చుక్కెదురైంది. బుధవారం నాడు తుళ్లూరు మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. ఈ సందర్భంగా 16 గ్రామాలు అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఇప్పటికే ఈ విషయంపై పలుచోట్ల అధికారులు గ్రామ సభలు నిర్వహించగా ఈరోజు ఆఖరి గ్రామ సభను తుళ్లూరులో నిర్వహించారు.
2014లో సీఆర్‌డీఏ చట్టంలోని 29 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్‌కు తాము అనుకూలమని ప్రజలు గ్రామ సభల ద్వారా స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని, క్యాపిటల్ సిటీని ముక్కలు చేస్తే తాము అంగీకరించే ప్రసక్తే లేదని ఈ ప్రాంత ప్రజలు తేల్చి చెబుతున్నారు. కాగా రాజధాని అమరావతి ప్రాంతంలోని 19 గ్రామాలను అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో నిర్వహించిన గ్రామ సభల్లో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు వచ్చాయి.