సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగిందంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్న ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం తొమ్మిది వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొన్నామని విపరీతంగా ప్రచారం చేసుసుంటోందని, 2020 నవంబర్ నెలలో సెకీ పిలిచిన టెండర్లల్లో రూ. 2కే సౌర విద్యుత్ ఇచ్చారని అన్నారు. అలాగే గుజరాత్ రాష్ట్రం రూ. 1.99కే సౌర విద్యుత్ కొనుగోలు చేసిందని, రూ. 2.49 ఏపీ కొనుగోలు చేయడం ఎంత వరకు కరెక్ట్..? అని ప్రశ్నించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రూ. 2.49 ఏ విధంగా చౌక అవుతుందని ఆయన ధ్వజమెత్తారు.
‘గంటల్లోనే ప్రతిపాదనలు.. ఆమోదాలు ఏ విధంగా జరిగాయి. గతంలో గ్రిడ్ సేఫ్టీ లేదన్న ప్రభుత్వం.. ఇప్పుడు గ్రిడ్ ఎలా తట్టుకుంటుందని భావిస్తోంది. సెకీ నుంచి డిస్కంలకు విద్యుత్ చేరే నాటికి రూ. 2.49 కాదు.. అంతకంటే ఎక్కువే. సెకీ నుంచి డిస్కంలకు విద్యుత్ చేరే సరికి రూ. 4.50 దాటినా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం నిర్ణయం వల్ల పేదలు.. రైతులపై రూ. 1.20 లక్షల కోట్ల భారం పడనుంది. రైతుల పేరుతో జరిగే ఈ విద్యుత్ కోనుగోళ్ల వ్యవహరం స్కీమ్ కాదు.. అదానీ లాభం కోసం చేసే స్కామ్. ప్రభుత్వం పెట్టుకున్న రివర్స్ టెండరింగ్ ఏమైంది..? జూడిషీయరీ ప్రివ్యూ ఏమైంది. రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను అదానీలకి నామినేషన్ పద్దతిలో ఇచ్చేశారు. ఏపీఈఆర్సీనే విద్యుత్ కొనుగోలు ధరను నిర్ణయించాలి.. కానీ ఆ విధంగా చేయలేదు. సీఎంకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా..?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
సెకీ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఇతర రాష్ట్రాలకు మేలు చేకూరేలా చేయడం ఏంటని, గతంలో ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లను అదానీకి కట్టబెట్టినప్పుడు కోర్టు కొట్టేసి కొత్త టెండర్లు పిలమని చెప్పినా ఎందుకు పిలవలేదని, అదానీకి ఇక్కడ దక్కని టెండర్లను.. సెకీ రూపంలో కట్టబెట్టారన్నారు. ఏపీలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మౌళిక సదుపాయాలు ఉన్నా.. పక్క రాష్ట్రాల్లో లబ్ది కలిగించడం దేనికని, ఈ స్కీమ్ అమలు చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలోనే సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా టెండర్లు పిలవాలన్నారు. పంజాబ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల్లో కోతలు విధించి రూ. 1.19కే అందిస్తోంది.. ఏపీలో అంతకు మించి అవకాశం ఉన్నా.. ఎందుకు చేయడం లేదని ఆయన అన్నారు.