తిరుపతిలోని చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం నుంచి తిరుపతి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా, సుమారు 300 అడుగుల లోయలో పడ్డ బస్సు పడిపోయింది. అయితే ఈ ఘటనపై తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. భాకరాపేట లోయలో ప్రమాదం శోచనీయమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారని, ఇటువంటి బస్సుల యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి లేనిపక్షంలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
బస్సులకు స్పీడ్ కంట్రోల్స్ ను తక్షణం అమర్చే చర్యలు చేపట్టాలని, ఘాట్ రోడ్లలో రక్షణ గోడలను పటిష్టపరచాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి తగినంత నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందివ్వాలని,
గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ ప్రమాదంలో అశువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు.