Land Rates: ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువ భారీగా పెరగబోతోంది.. రేపట్నుంచి ఏపీలో పెరగనున్న భూముల ధరలు అమల్లోకి రాబోతున్నాయి.. భూముల మార్కెట్ ధరలను సవరించే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.. భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం చేరవేసింది ప్రభుత్వం.. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. కొన్ని చోట్లే భూముల ధరలను పెంచాలనే సూచనలు ఉన్నాయి.. అంటే.. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైతే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతాయో.. ఆ ప్రాంతాల్లో భూముల ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది.. ఈ సారి 10-15 శాతం మేర భూముల విలువను పెంచే అవశాలు ఉన్నాయని చెబుతున్నారు.. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఎదురు చూస్తోంది.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఉత్తర్వులు విడుదల చేయనున్నారు అధికారులు.
Read Also: Elon Musk: పెళ్లి కుమారుడి గెటప్‌లో ఎలాన్ మస్క్.. వైరలవుతున్న ఫొటోలు
అయితే, గత ఏడాది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏపీ ప్రభుత్వం మార్కెట్ ధరలను పెంచేసింది.. కానీ, జిల్లా కేంద్రాలతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ధరలను పెంచింది. ఇప్పుడు మరోసారి భూముల ధరలను పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.. అయితే గతంలో ఏ ఏ ప్రాంతాల్లో భూముల ధరలను పెంచలేదో వాటి ధరలను మాత్రమే ఇప్పుడు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో భూముల ధరలు పెంపు వేర్వేరుగా ఉండబోతోంది.. మరోవైపు.. 2020 తర్వాత ఏపీలో మార్కెట్ విలువను పెంచలేదు. స్పెషల్ రివిజన్ పేరిట ఇప్పుడు మార్కెట్ వేల్యూని పెంచుతుంది. గత ఏడాది కొత్త జిల్లాల ఏర్పాటు కాకముందు ఉమ్మడి జిల్లాలోని బాపట్ల, పల్నాడు, గుంటూరులో మార్కెట్ విలువను పెంచింది ఏపీ ప్రభుత్వం. 2022 ఏప్రిల్ లో కొత్త జిల్లా కేంద్రాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంచింది. ఇక, మూడు రాజధానులకు కట్టుబడి ఉంటామంటున్న వైసీపీ సర్కార్.. త్వరలోనే విశాఖ కేంద్రం పాలన ప్రారంభిస్తాం అంటోంది.. దీంతో, విశాఖ లాంటి నగరాల్లో భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది.. విశాఖ నగరంలో ప్రాంతాన్ని బట్టి మార్కెట్ విలువ పెంచబోతున్నారట.. విశాఖ, గాజువాక, గోపాలపట్నం, ద్వారకానగర్, పెందుర్తి, భీమిలి, మధురవాడ, ఆనందపురం ఏరియాల్లో డిమాండ్‌ను బట్టి ధరలు పెంచనున్నట్టు తెలుస్తోంది.. దీనిపై ఉత్తర్వులు విడుదలైతే క్లారిటీ రానుంది.