అసని తీవ్ర తుఫాన్‌గా మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని తీర ప్రాంతానికి ముప్పు ఏర్పడింది. అసని ప్రభావంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణశాఖ అంచనాలను తలకిందులు చేస్తూ అసని తీవ్ర తుఫాన్ తన దిశను మార్చుకుని కాకినాడ తీరం వైపుకు దూసుకువస్తోంది. దీంతో కాకినాడ, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో అధికారులు గ్రేట్ డేంజర్ సిగ్నల్-10 జారీ చేశారు. అసని తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తున్నాయి. భయంకరమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. అసని తీవ్ర తుఫాన్ కాకినాడ వద్ద తీరం దాటనుంది. తీరాన్ని తాకిన తర్వాత రీకర్వ్ తీసుకుని విశాఖకు దక్షిణ నైరుతి దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారానికి అసని బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి మచిలీపట్నానికి అతి దగ్గరలో 90 కి.మీ. దూరంలో అసని కేంద్రీకృతమై ఉంది. కాగా అసని తీవ్ర తుఫాన్ కారణంగా కోస్తా వైపు వెళ్లే రైళ్లను అధికారులు రద్దు చేశారు. అటు వరుసగా మూడో రోజు కూడా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
అసని తీవ్ర తుఫాన్‌తో తూర్పు నావికా దళం అధికారులు అలర్ట్ అయ్యారు. ఏపీ, ఒడిశా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి తీవ్ర తుఫాన్ గమనాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో సహాయ, వైద్య సేవలు అందించేందుకు యుద్ధనౌకలు,హెలికాప్టర్లను నేవీ అధికారులు అందుబాటులో ఉంచారు. విశాఖలోని ఐ.ఎన్.ఎస్ డేగా, చెన్నైలోని ఐ.ఎన్.ఎస్ రాజాలీ నుంచి ఏరియల్ సర్వే, రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 19 వరద సహాయ బృందాలు, ఆరు డైవింగ్ టీమ్స్, జెమినీ బోట్లతో కూడిన ఐదు యుద్ధనౌకలు సిద్ధం చేశారు. ఐ.ఎన్.ఎస్.డేగ యుద్ధ స్థావరంలో హెలికాప్టర్లను నావికాదళం మోహరించింది.
Asani Cyclone: ఏపీకి అలెర్ట్.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్