సీఎం జగన్‌కు, ఆయన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని కామెంట్ చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. జగన్ పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందన్న ఆయన.. ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి ఈ ప్రభుత్వం ఏ సమాధానం చెబుతుంది..? అని ప్రశ్నించారు. వెంకాయమ్మకు సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా? అని మండిపడ్డ ఆయన.. వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ దగ్గర వున్నది కిరాయి మూకలు.. మా దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులు అని పేర్కొన్న ఆయన.. నిరక్షరాస్యత, నిరుపేద, దళిత మహిళ వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోంది.. ఐదు కోట్ల మందిపైనా దాడి చేయిస్తారా జగన్ గారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: R Krishnaiah: రాజ్యసభకు బీసీ ఉద్యమ నేత..! ఆర్. కృష్ణయ్య ఆనందం..
ఇక, జగన్‌ను చూసి జనం పారిపోతుండడంతో ఆయనలోని మూర్ఖపు ఫ్యాక్షన్ భూతం నిద్రలేచిందని విమర్శించారు లోకేష్.. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ, జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తోన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ కారు ధ్వంసం చేసి చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడం దారుణం అన్నారు.. జగన్, ఆయన ఎమ్మెల్యేలకు ఓటమి ఫోబియా పట్టుకుంది.. ప్రశ్నించే ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారని.. జగన్ సీను కాలిపోయి చాన్నాళ్లయ్యిందన్నారు.. జగన్ మాటలు బూటకమని, చేతలు నాటకమని జనానికి తెలిసిపోయింది… దుకాణం సర్దుకోండి ఇక అని హెచ్చరించారు. వైసీపీ ఆకురౌడీలకి ఎవ్వరూ భయపడరు.. సాయినాథ్ శర్మకి అండగా తెలుగుదేశం పార్టీ యావత్తు ఉందన్నారు నారా లోకేష్.