సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారు. థియేటర్ల రేట్లు, ఆన్‌లైన్ విధానంపై మంత్రి వారితో చర్చించనున్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై థియేటర్ యజమానుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి సమావేశమై థియేటర్ల ఓపెన్, ప్రస్తుత విధానం నుంచి ఆన్ లైన్ విధానానికి మారే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఆన్‌లైన్ టిక్కెటింగ్ విధానం కోసం రూపొందించే వెబ్‌సైట్ విషయంలో ఓనర్ల అభిప్రాయాలు తీసుకుంటున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టంలోని సవరణలు, అన్ని సినిమా లకు ఒకే టిక్కెట్ ధరను నిర్ణయించడం, థియేటర్‌ల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ తరహా సమావేశాలను విశాఖ, తిరుపతి నగరాల్లో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుందని మంత్రి పేర్ని నాని తెలిపారు.