Srisailam Dam: శ్రీశైలం జలాశయం.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో చాలా కీలకం. జల విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం జలాశయందే సింహభాగం. సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న బహుళార్తక సాధక ప్రాజెక్టు శ్రీశైలం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు 2009లో ప్రమాదంలో పడింది. కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి వచ్చిన 25 లక్షల క్యూసెక్కుల వరద ఉద్ధృతిని తట్టుకొని నిలబడిన మహోన్నతమైన ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం.. ఈ ఏడాది ఆగష్టులోగా మరమ్మతులు చేయకుంటే ముప్పు తప్పదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. ఈమేరకు ఈనెల మొదటివారంలో జలవనరుల శాఖకు లేఖ కూడా రాసింది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అప్రమత్తమై కీలక సమావేశం నిర్వహించారు.
Read Also: Trivikram Srinivas : నేను ‘సినివెన్నెల’పై కోప్పడ్డాను.. త్రివిక్రమ్ సంచలనం..
2009లో వచ్చిన వరద ఉధృతిని శ్రీశైలం ప్రాజెక్టు తట్టుకొని నిలబడినా మనుగడ ప్రశ్నర్థకంగా ఉంది. 2009లో వచ్చిన వరదలతో డ్యామ్ కట్ట దిగువన ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన గొయ్యి ప్రమాదకరంగా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి విడుదల సామర్థ్యం 13.5 లక్షల క్యూసెక్కులు. అదనంగా విడుదల చేసినా మరో లక్ష క్యూసెక్కులు పెంచవచ్చు. అయితే, 2009లో వచ్చిన వరద ప్రవాహం కృష్ణ నది నుంచి 15 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 10 లక్షల క్యూసెక్కులు. మొత్తం 25 లక్షల క్యూసెక్కులు వరద ప్రవాహం శ్రీశైలం జలాశయంను తాకింది. ఆ సమయంలో వరదనీరు క్రస్ట్ గేట్లపై నుంచి ప్రవహించింది. శ్రీశైలం డ్యామ్ కట్ట తెగిపోతుందా అనెంతగా వరద వచ్చింది. అప్పుడే శ్రీశైలం జలాశయం ప్రమాదంలో పడింది. 11 ఏళ్ల క్రితం ఏర్పడిన గొయ్యి క్రమంగా పెరుగుతున్నట్టు నిపుణుల అంచనా వేస్తున్నారు. సుమారు 100 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది. డ్యామ్ 6,8 క్రస్ట్ గేట్ల మధ్య ప్లంజ్ పూల్ లో ఏర్పడిన గొయ్యిపై అనేక నిపుణుల కమిటీలు అధ్యయనం చేసాయి. ఓషియనోగ్రఫీ నిపుణులు, కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ పలుసార్లు అధ్యయనం చేసాయి. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ పాండ్యన్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ రెండుసార్లు అధ్యయనం చేసింది. గంగజల్ సాక్షారత యాత్రలో భాగంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచే రాజేంద్రసింగ్ కూడా శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉందంటూ హెచ్చరించారు. నీటి అడుగుభాగంలోకి వెళ్లి బాత్ మెట్రిక్ అధ్యయనం కూడా చేశారు.
Read Also: Nithin : తమ్ముడు సినిమా నుంచి ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ రిలీజ్..
శ్రీశైలం జలాశయం పరిస్థితిపై ఎన్ని అధ్యయనాలు చేసినా , ఎన్ని సిఫార్సులు చేసినా ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. 2002 లో ప్లంజ్ పూల్ గొయ్యికి కాంక్రీట్ వేసినా కొట్టుకుపోయింది. మరమ్మతుకు చేయకుండా ఇలాగే జాప్యం చేస్తే ప్లంజ్ పూల్ లో ఏర్పడిన గొయ్యి డ్యామ్ కట్టవైపు విస్తరించి కట్టకే ప్రమాదం ఏర్పడితే డ్యామ్ ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం జలాశయం సీడబ్ల్యూసీ బృందం కూడా సందర్శించింది. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు, సిఫార్సులను పరిశీలించి అధికారులతో సమీక్షించింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ పాండ్యన్ ఆధ్వర్యంలో డ్యామ్ భద్రతను పరిశీలించింది. గత నెలలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా శ్రీశైలం. ప్రాజెక్టును అధ్యయనం చేసింది. డ్యామ్ దిగువన నిర్మించిన కాంక్రీట్ సిలిండర్లు కూడా దెబ్బ తిన్నాయని గుర్తించింది. 62 కాంక్రీట్ సిలిండర్లు ఉండగా 12 దెబ్బతిన్నాయి. ఇది డ్యామ్ పునాదులు దెబ్బతినేందుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. 14 ఏళ్లుగా మరమ్మతులు చేయకుండా కాలయాపన చేయడంతో డ్యామ్ మరింత ప్రమాదంవైపు నెత్తినట్లయింది. తాజాగా శ్రీశైలం జలాశయాన్ని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ విజయభాస్కర్ ఆధ్వర్యంలో బృందం కూడా పరిశీలించింది. దీంతో, ఇప్పటికైనా శ్రీశైలం జలాశయం వద్ద మరమ్మతులు చేపడతారా? మరోసారి వాయిదా వేస్తారా? అనేది వేచిచూడాలి..