Nandyala Constable Surender Kumar Accused Sent To 14 Days Remand: మందు తాగి అల్లరి చేయొద్దని మందలించిన పాపానికి.. కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ (35)ను నంద్యాలలో ఈనెల 7వ తేదీన కొందరు దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసిన చేసిన సంగతి తెలిసిందే! ఈ కేసుని సుమోటోగా తీసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఎట్టకేలకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. నిందితులకు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు.. అనంతరం జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో నిందితులకు జడ్జి అర్చన 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
కాగా.. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సురేంద్రనాథ్, రోడ్డు పక్కన మద్యం సేవిస్తూ అల్లరి చేస్తున్న రౌడీ షీటర్లు కనిపించారు. దాంతో అల్లరి చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన వారిని మందలించారు. కోపాద్రిక్తులైన ఆ రౌడీషీటర్లు.. బీరు సీసాలతో ఆయనపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు సురేంద్రనాథ్ ప్రయత్నించగా.. వెంబడించి ఆయన్ను పట్టుకున్నారు. ఆటోలో ఎక్కించుకొని, ఒక చోటుకి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపారు. ఘటనా స్థలం నుంచి ముగ్గురు పారిపోగా.. పట్టణంలోకి వచ్చి మరో ఇద్దరు బైక్ దొంగలించి పరారయ్యారు. ఆ కానిస్టేబుల్‌ని ఆటో డ్రైవర్ ఆసుపత్రికి తీసుకురాగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
కానిస్టేబుల్ సురేంద్ర నిజాయితీ కలిగిన ఉద్యోగి అని, క్రిమినల్ సమాచారం ఇవ్వడంలో సమర్థుడని డీఐజీ సెంథిల్ కుమార్ అన్నారు. అతని కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరారీలో ఉన్న వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్చలు తీసుకుంటామని తెలిపారు. అటు.. తమ ఇంటికి పెద్ద దిక్కు అయిన సురేంద్ర కుమార్, ఇలా దారుణ హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులో శోకసంద్రంలో మునిగిపోయారు.