బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విజయవాడ పోలీసులకు పట్టుబడ్డ తన అనుచరులను విడిపించుకునేందుకు అర్దరాత్రి సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఎంపీ సమక్షంలోనే ఆయన అనుచరులు పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది.
బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఆయన అనుచరుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. విజయవాడలో నిన్న అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం ఎంపీకి తెలియడంతో.. ఆయన తన అనుచరులతో కలిసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
యువకులను ఎందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఎంపీ అనుచరులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. ఎంపీ అనుచరులను సెల్ పోన్లో వీడియో తీసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ నుంచి ఫోన్ లాక్కున్నట్లు ప్రచారం జరుగుతుంది. అధికారపార్టీ ఎంపీ అర్దరాత్రి స్టేషన్ కు రావడం, పోలీసులు, ఎంపీ అనుచరుల మద్య వాగ్వాదం జరగడం సంచలనం సృష్టిస్తోంది.