గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. గుడివాడలో అసలు క్యాసినో నిర్వహణ జరగలేదని ఆయన అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందాలు, పేకాట శిబిరం మాత్రమే జరిగాయని, కొడాలి నాని అనారోగ్యంతో ఉండటంతో నా స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. శిబిరం నిర్వహించిన వారు నా స్నేహితులు, వారు ఎవరో కూడా కొడాలి నానికి తెలియదని, అది క్యాసినో, క్యాబేరోనే కాదన్నారు. టీడీపీ హయాంలో మేం పనిచేసాం, అప్పుడు నిర్వహించిన శిబిరాలే ఇప్పుడు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ నేతలు చెబుతున్నట్టు k కన్వీన్షన్ లో కాదు దాని పక్కన లే అవుతున్న స్థలంలో జరిగాయని, రాజకీయ లబ్ది కోసమే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో నానా యాగీ చేస్తోందని అన్నారు. అమ్మాయిల డ్యాన్సుల్లో అర్ద నగ్న దృశ్యాలు లేవన్నారు. పోలీసుల విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయని, మేం విమర్శలు చేస్తే విలవిలలాడే చంద్రబాబు మాపై మాత్రం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారిక వెబ్ సైట్స్ లో కొడాలి నాని, నా పై పోస్టింగులు పెట్టిస్తున్నారని, కొడాలి నాని, నేను టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నామనే ఈ దాడి జరుగుతోందని అన్నారు.