Botsa Satyanarayana: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు వైసీపీ వికేంద్రీకరణ రాగం అందుకుందని టీడీపీ ఆరోపిస్తుంటే.. వికేంద్రీకరణ చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 15న ఉదయం 9 గంటల నుంచి విశాఖ ఎల్‌ఐసీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డు వరకు భారీ ప్రదర్శన ఉంటుందని బొత్స వెల్లడించారు. వికేంద్రీకరణపై మన ఆవేశాన్ని వ్యక్తపరచాల్సిన అవసరం ఉందన్నారు. ముసుగులో గుద్దులాట అవసరం లేదని.. అమరావతి రైతుల పాదయాత్ర వెనుక టీడీపీ ఉందని తేలిపోయిందన్నారు. మన ఆకాంక్షలు చెప్పాల్సింది మనమేనని మంత్రి బొత్స పేర్కొన్నారు.
Read Also: Bandi Sanjay: టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండి.. బీజేపీకి ఓటెయ్యండి
అటు తనకు బుర్ర లేదన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడికి బుర్ర ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన కంటే బరువు, పొడవు ఎక్కువ ఉన్నంత మాత్రాన అచ్చెన్నాయుడు జ్ఞాని అయిపోతారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలకు, వాళ్ల వారసులకు ఉత్తరాంధ్రలో ఆస్తులు, పదవులు కావాలి కానీ అభివృద్ధి వద్దా అని నిలదీశారు. అచ్చెన్నాయుడు భాష సంభాళించుకోవాలని.. టీడీపీ నేతలు సహనం కోల్పోయి మాట్లాడటం సరికాదని మంత్రి బొత్స హితవు పలికారు. విశాఖను రాజధానిని చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటన్నారు. ఈనెల 15న జరిగే విశాఖ గర్జనను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 12న అన్ని వార్డుల్లో మానవహారాలు ఏర్పాటు చేస్తామన్నారు.